జీతాలివ్వకుండా ఇబ్బందులు పెట్టొద్దు

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం 2వ రోజుకు చేరుకుంది. ఏంజెల్‌ టాకీస్‌ వద్ద గల ధర్నా చౌక్‌ సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి యుటిఎఫ్‌ సత్తెనపల్లి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.విష్ణుమూర్తి, ఎ.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పీఆర్సీ అమలు చేయకుండా నెల తరబడి వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. మినిమం టైం స్కేల్‌పై జీవోలిచ్చినా అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు విభజన సృష్టించే విధానాలు అమలు చేస్తున్నారని, పాత వారికి వేతనాలు పెంచకుండా కొత్తగా నియమితులైన వారికి వేతనాలు పెంచుతున్నారని విమర్శించారు. ఫ్యాప్టో పల్నాడు జిల్లా అధ్యక్షులు సంపత్‌ కుమార్‌, పిఆర్‌టియు జిల్లా అధ్యక్షులు కె.శ్యామ్‌ మోజేష్‌, జిల్లా నాయకులు షేక్‌ సత్తార్‌, సమగ్ర శిక్ష అభియాన్‌ ఏఎస్‌ ఓ,ఏపీఓ, ఏఎంఓ, ఏఎల్‌ఎస్‌ఓ, ఎడిలు, డీఈఓ కార్యాలయ ఎపిఓ జి దేవరత్నం, ఎస్టీయూ పల్నాడు జిల్లా నాయకులు రామిరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చి ఇప్పుడు విస్మరించారని, ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని విమర్శించారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌, ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జేఏసీ నాయకులు పి.రామకృష్ణ, పి.సాంబశివరావు, షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌, లింగయ్య, సుభాని, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️