జోరుగా కోడిపందాలు, జూదాలు

Jan 14,2024 22:39
సంక్రాంతికి రాజకీయ

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం

సంక్రాంతికి రాజకీయ సెగ తగిలింది. ఎన్నికల కోలాహలం కోడి పందాలను తాకింది. అతి దగ్గర్లో ఉన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారపక్షం పందేలకు అండగా నిలిచి ‘బరి’ తెగించింది. అన్ని చోట్ల అధికార పార్టీ నేతలే స్వయంగా రంగంలోకి దిగారు. ఎంఎల్‌ఎల బంధువులు, జిల్లా, మండల స్థాయి నేతలు పందాలను పర్యవేక్షించారు. మూడు రోజులపాటు కత్తులు కట్టిన కోళ్ళతో కోడిపందాలు, గుండాట, కోత ఆట తదితర అన్ని రకాల జూదాలకు తెరలేపారు. న్యాయస్థానం ఉత్తర్వులతో పోలీసులు ఎంతగా హెచ్చరించినా రాజకీయ ప్రోద్భలంతో చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఆర్భాటపు ప్రకటనలు, ఆడంబర ప్రచారాలు సాగించినప్పటికీ ఆఖరి నిమిషంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించక తప్పలేదు.

జిల్లా ఎస్‌పి కార్యాలయానికి కూత వేట దూరంలో నగరంలోని గొడారగుంట, గైగోలుపాడు, కాకినాడ రూరల్‌ మండలంలోని తూరంగి, సర్పవరం, తిమ్మాపురం, రమణయ్యపేట, వలసపాకల, పండూరు, చీడిగ, కొవ్వూరు, వాకలపూడి, కరప మండలంలోని గురజానపల్లి, గొర్రిపూడి, పిఠాపురం పట్టణంలోని వైఎస్‌ఆర్‌ గార్డెన్‌, రూరల్‌ మండలంలోని ఎఫ్‌కె. పాలెం, విరవ, విరవాడ, కోలంక, గోకివాడ, సామర్లకోట మండలం చంద్రంపాలెం, వేట్లపాలెం, కిర్లంపూడి, జగ్గంపేట, కోటనందూరు, రౌతుల పూడి, తుని, తొండంగి, గొల్లప్రోలు, యూ. కొత్తపల్లి తదితర మండలాల్లో పలు గ్రామాల్లో కోడిపందాలు యథేచ్ఛగా ప్రారంభమయ్యాయి. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన గెద్దనపల్లిలో భారీగా కోడిపందేల బరి ఏర్పాటు చేశారు. టెంట్లు ఇతర హంగామా మొదలైంది. మలికిపురం మండలం లక్కవరం, మలికిపురం, గుడిమెల్లంక, మేడిచెర్లపాలెం, కత్తిమండ, బట్టేలంక, కేశనపల్లి, తూర్పుపాలెం, సఖినేటిపల్లి మండలంలోని సఖినేటిపల్లి లంక, అంతర్వేది దేవస్థానం, పల్లెపాలెం, టేకిశెట్టిపాలెం మామిడికుదురు మండలంలోని గోగన్నమఠం, మగటపల్లి, రాజోలు, కాట్రేనిపాడు, శివకోడు, అల్లవరం మండలంలోని కోడూరుపాడు, ఎంట్రుకోన, అల్లవరం, ఐ. పోలవరం మండలంలోని కేశనకుర్రు, కోమరగిరి, పోలవరం తదితర ప్రాంతాల్లో కోడిపందాలు సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సైతం పలు ప్రాంతాల్లో జూదాలు ప్రారంభమయ్యాయి. సోమ, మంగళవారాల్లో కూడా యథేచ్ఛగా జరగనున్నాయి. కోర్టుల ఆంక్షలు, పోలీసుల అదేశాలన్ని బేఖాతర య్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 250 బరుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా పందాలు, జూదం నిర్వహిస్తున్నారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ పెద్దలు కోడి పందాల నిర్వహణ పట్ల మౌనం వహించాలంటూ పోలీసులను కట్టడి చేసినట్లు తెలిసింది.తొలి రోజు రూ.100 కోట్లు పైనేమూడు జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత పందేలు, జూదాలు జోరందుకున్నాయి. మొదటి రోజు సుమారు రూ.100 కోట్లు చేతులు మారినట్లు అంచనా. తొలిరోజే ఈ స్థాయిలో ఉంటే మిగిలిన రెండు రోజులు తారా స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. బరులు నిర్వహణ పేరుతో అధికార పార్టీ నేతలు భారీగా ముడుపులు దక్కించుకున్నారన్న ప్రచా రం జరుగుతోంది. గుండాట నిర్వహణకు వేసిన వేలం పాటల్లో అధిక మొత్తాలను ఆ పార్టీ నేతలు ఖాతాల్లోకి తరలించినట్లు తెలిసింది. ఒకవైపు పందెం నిర్వాహకులను సంతోషపరచడం, మరో వైపు తమ పార్టీ నేతలకు ఆర్థిక ప్రయోజనం నెరవేరుతుండడంతో అధికార పార్టీ పెద్దలు అన్ని రకాలుగా అవకాశాలు కల్పించినట్లు సమాచారం. అయితే కోడి పందాల జోరు మాత్రం పలువురు సామాన్యుల జేబులను కాళీ చేస్తుంది. జూదాల కారణంగా పండుగ సంతోషాన్ని కూడా దూరం చేస్తున్నట్లు కన్పిం చింది. యువత, మహిళల్ని కూడా పందేలు, జూదాలకు దగ్గర చేస్తుండడం ఆందోళనకరంగా కనిపిస్తుంది. కొసమెరుపు ఆదివారం ఉదయం నుంచి యథేచ్ఛగా కోడిపందేలు, గుండాట, ఇతర జూద క్రీడలు జరిగాయి. అయితే సాయంత్రం తర్వాత పోలీసుల హడావుడి కనిపించింది. కాకినాడ రూరల్‌ వలసపాకలలో నిర్వహిస్తున్న కోడిపందాలు, గుండాటలను తన సిబ్బందితో కాకినాడ డిఎస్‌పి మురళీకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమందిని అదుపులోకి తీసుకుని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆంక్షలు లెక్క చేయకుండా కోడి పందాలు, గుండాటలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

➡️