జోరుగా జీరో వ్యాపారం!

Feb 22,2024 23:42

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో యార్డు పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. యార్డులో కాలు దీసి కాలు పెట్టేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. గురటూరు- చిలకలూరి పేట, గుంటూరు-సత్తెనపల్లి మార్గంలో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. యార్డుకు రోజుకు లక్షన్నర టిక్కీలు సరుకువస్తుండగా అధికారులు రికార్డులో తక్కువ సరుకు చూపిస్తూ జీరో వ్యాపారానికి తెరతీశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రైతుల నుంచి నేరుగా వ్యాపారులు అక్కడిక్కడే కొనుగోలు చేసి యార్డు రికార్డుల్లో నమోదు కాకుండా సరుకును బయటకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది వ్యాపారులతో యార్డు అధికారులు కుమ్మక్కు అవుతున్నారు. కొంతమంది రైతులు వ్యాపారులు ఇచ్చే ధర నచ్చక తమ సరుకు కోల్డ్‌ స్టోరేజీలో పెట్టుకుంటామని చెబితే అందుకు కూడా అధికారులు కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.యార్డులో భారీగా సరుకు వస్తున్నందు వల్ల తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన యంత్రాంగం సందట్లో సడేమియా అంటూ అటు వ్యాపారుల నుంచి ఇటు రైతుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై విజిలెన్సు, నిఘా విభాగం అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది. యార్డుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం 1,28,837 టిక్కీలు వచ్చాయి. పాత నిల్వలతో కలిపి 1,23,214 టిక్కీలు అమ్ముడుపోయాయి. ఇంకా 1,15,034 టిక్కీలు నిల్వ ఉన్నాయి. సరుకు భారీగా వస్తుండటంతో ధరలను ఏమాత్రం పెంచకపోగా తగ్గిస్తున్నారు. గతేడాది ఇదే రోజుల్లో మిర్చి ధరలు గరిష్టంగా రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకు ఉన్నాయి. ప్రస్తుతం మేలురకం తేజ, బాడిగ రకాలు కనిష్టంగా రూ.8,500 ఉండగా గరిష్టంగా రూ.21 వేలు పలికాయి. సాధారణ రకాల ధరలు కనిష్టంగా రూ.9 వేలు పలకగా గరిష్టంగా రూ.20,500 మాత్రమే పలికాయి. 334 గరిష్ట ధర క్వింటాళ్‌ రూ.20,500, నెంబరు.5 రూ.20 వేలు, 273 గరిష్టంగా రూ.16,800, 341 రూ.20,500, సూపర్‌ 10 రూ.16,500కి ధర పలికింది. గత నెల రోజుల కాలంలో సరుకు ఎక్కువ వచ్చిన రోజున ధరలు తగ్గించడం, సరుకు తక్కువగా వచ్చిన రోజు సగటు ధర స్వల్పంగా పెంచడం వ్యాపారులకు పరిపాటిగా మారింది. ఏ వెరయిటీ కూడా గరిష్టంగా రూ. 21 వేలు దాటిన పరిస్థితి లేదు.ఇళ్లల్లో నిల్వ చేసుకోలేమని, కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసుకున్నా ప్రస్తుతం అప్పులు చెల్లించేందుకు నగదు అవసరం అని రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రతి బుధవారం సెలవుమిర్చి సీజన్‌లో రద్దీ ఎక్కువగా ఉన్నందున ఇక మీదట ప్రతి బుధవారం సెలవు ఇస్తున్నట్టు యార్డు కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. ట్రాఫిక్‌ అంతరాయంను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు, ఉద్యోగులు, కమీషన్‌ ఏజెంట్లతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లోనే యార్డుకు సరుకు తేవాలని కోరారు.

➡️