జ్వర నిర్ధారణ పరీక్షల నివేదికలు స్పష్టంగా ఉండాలి

Mar 19,2024 21:22

ప్రజాశక్తి – బెలగాం: జ్వర నిర్ధారణ పరీక్షల నివేదికలు స్పష్టంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు సిబ్బందిని ఆదేశించారు. స్థానిక జిల్లా ఆసుపత్రిలో జనరల్‌ ల్యాబ్‌, డెంగీ నిర్ధారణ పరీక్షల కేంద్రాలను (ఎస్‌ఎస్‌ హెచ్‌) మంగళవారం తన వైద్య బృందంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వర లక్షణాలతో వచ్చిన వారికి వైద్యుల సూచనల మేరకు ల్యాబ్‌లో చేపడుతున్న మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షల వివరాలు, నివేదికలను రికార్డుల్లో పరిశీలించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వివరాలు స్పష్టంగా నమోదు చేసి డిఎంఒ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. అదే వివరాలు ఐహెచ్‌ఐపి పోర్టల్‌ లో ఆన్లైన్‌ నమోదు కచ్చితంగా ఉండాలని ల్యాబ్‌ సిబ్బందిని ఆదేశించారు. తద్వారా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ, నివారణా చర్యలు చేపడతామని తెలిపారు. డెంగీ నిర్ధారణ పరీక్షల పరికరాన్ని పరిశీలించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్మోహన్‌ మాట్లాడుతూ జిల్లాలో రెండు డెంగీ నిర్ధారణ పరీక్షా (ఎస్‌ఎస్‌హెచ్‌) కేంద్రాలున్నాయని, రెండోది పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది డెంగీ ఎన్‌ఎస్‌-1 కిట్లు ఉపయోగించి ఆ జ్వర లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహిస్తారని, అందులో పాజిటివ్‌గా వస్తే ఆ పరిధిలో ఉండే సెంటినల్‌ సర్వలెన్స్‌ ఆసుపత్రి (ఎస్‌ఎస్‌హెచ్‌)కి వారి నమూనాలు పంపిస్తానని, అక్కడ ఎలీసా, ఐజిఎం నిర్ధారణ పరీక్షలు చేపట్టి అందులో పాజిటివ్‌గా వస్తే డెంగ్యూ గా నిర్ధారిస్తారని అన్నారు. అలాగే మలేరియాకు ఆర్డిటి, రక్త పూతల సేకరణ స్లైడ్‌ల ద్వారా నిర్ధారిస్తారన్నారు. ల్యాబ్‌లో సిబ్బందికి, ట్రైనీ సిబ్బందికి పలు వ్యాధులు, నిర్ధారణ పరీక్షలు గురించి వివరించారు. అనంతరం వార్డులో జ్వర లక్షణాలున్న వారిని సందర్శించి ఆరోగ్య పరిశీలన చేశారు. వారి నివాస పరిధికి చెందిన పిహెచ్‌సి సిబ్బంది ఆ ప్రాంతంలో ఫీవర్‌ సర్వే చేపట్టాలని వైద్య బృందాన్ని ఆదేశించారు. ఆయన వెంట పార్వతీపురం సబ్‌ యూనిట్‌ అధికారి సిహెచ్‌.ధనుంజయరావు, మలేరియా టెక్నికల్‌ సూపర్‌ వైజర్‌ రామకష్ణ ఉన్నారు.

➡️