టిడిపిని వీడని ఉత్కంఠ

Jan 27,2024 20:55

ప్రజాశక్తి-సాలూరు: సాలూరు నియోజకవర్గంలో టిడిపి శ్రేణులను ఇంకా ఉత్కంఠ వీడడం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే దానిపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి హోదాలో సంధ్యారాణి తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. తన అనుచరులతో కలిసి ఆమె ముందుకు పోతున్నారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు భంజ్‌దేవ్‌ లేకుండానే ఆమె కదనరంగంలోకి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తనకు పోటీగా తేజోవతిని తెరపైకి తెచ్చారనే ఆగ్రహంతో ఆమె రగిలిపోతున్నారు. పార్టీలో కొంతమంది సీనియర్‌ నాయకులు తేజోవతికి మద్దతుగా నిలబడడం, సొంతంగా ఎన్నికల ఖర్చు భరించగలిగే అభ్యర్థి కోసం పార్టీ అధిష్టానం అన్వేషించడం వంటి పరిణామాలు సంధ్యారాణికి టికెట్‌ సాధించడంలో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్థానికేతర నాయకురాలు అయినప్పటికీ తేజోవతికి పార్టీలో బలమైన గ్రూపు మద్దతుగా నిలబడడం, ఆర్థిక పరమైన అంశాలు ఆమెకి అనుకూలంగా పరిణమించే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గ పార్టీలో కొంత వ్యతిరేకత కలిగి ఉన్న సంధ్యారాణి అనుచరులు ఇటీవల శంబర పోలమాంబ జాతర సమయంలో తేజోవతి ఫ్లెక్సీలను చించివేయడం, ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదులు అందడంతో మరింత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేజోవతికి మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌తోపాటు బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబీనాయన ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆశీస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తేజోవతి కొద్ది రోజుల క్రితం మక్కువ మండలంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మండలానికి చెందిన సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావు అండతో ఆమె మండలంలో పర్యటించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయం నెలకొంది. ఎన్నికల ముహూర్తం సమీపిస్తున్నప్పటికీ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్‌ వీడడం లేదు.

➡️