టిడిపిలో గ్రూపుల గోల

Mar 20,2024 21:15

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : టిడిపిలో విజయనగరం, బొబ్బిలి మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రూపుల గోల రోజురోజుకూ బిగుసుకుంటోంది. ఆ పార్టీలోని అంతర్గత రాజకీయాలు ముదరపాకాన పడుతున్నాయి. విబేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. టిక్కెట్లు రాకపోవడం వల్ల కొందరు కినుక వహించగా, జనసేన, బిజెపితో పొత్తుకారణంగా మరికొందరు టిడిపి నేతలు అలకబూనారు. అభ్యర్థులు మాత్రం ఇవేవీ పట్టించుకో కుండా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు టిడిపి, జనసేన అభ్యర్థులను ఫిబ్రవరి 24న ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గజపతినగరంలో టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ, సీటు ఆశించి భంగపడ్డ కెఎ నాయుడు ఇంకా ప్రచారంలో కలిసిరాలేదు. తాను శ్రీనివాస్‌కు సహకరించే పరిస్థితే లేదని బాహాటంగానే చెబుతున్నారు. పున:పరిశీలనలో భాగంగా తనకు సీటు వస్తుందంటూ కేడర్‌ను శ్రీనివాస్‌తో వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారు. మరోవైపు శ్రీనివాస్‌, ఆయన అనుచరులు మాత్రం కొద్ది రోజుల్లో అన్నీ సమసిపోతాయని దీమా వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య నెలకొన్న అనైక్యతను వైసిపి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చీపురుపల్లిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జునను పక్కనబట్టి మాజీ మంత్రులు గంటా లేదా కిమిడి కళావెంటరావులను పోటీ చేయించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఈ ఇద్దరు నేతలూ ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పోటీలో ఎవరు నిలుస్తారో తెలియక కేడర్‌ అయోమయంలో ఉంది. అభ్యర్థి ఎవరనేది తేలే లోపే రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో వైసిపి నుంచి ఇక్కడ బరిలో దిగబోతున్న మంత్రి బొత్స సత్యనారాయణ స్పీడు పెంచారు. రాజాం అభ్యర్థి కొండ్రు మురళీ, టిడిపి సీనియర్‌ నేత కావలి ప్రతిభా భారతి మధ్య చాలా కాలంగా అంతర్గత విభేదాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రతిభా భారతి గ్రూపునకు సీనియర్‌ నేత కిమిడి కళావెంకటరావు పరోక్షంగా అండదండలందించారు. ప్రస్తుతం ఆయన ఆశిస్తున్న ఎచ్చెర్లలో సీటు ఖరారు కాలేదు. దీంతో, ప్రతిభా భారతి, ఆమె కుమార్తె గ్రీష్మ స్వరం తగ్గినప్పటికీ ఇప్పటికీ కోండ్రు మురళీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదు. ఎస్‌.కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ట మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ సీటు కోసం ఆశపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల లోకేష్‌ పర్యటనలో ఈ రెండు గ్రూపుల మధ్య పెనుగులాట వరకు వెళ్లిన సంగతి విధితమే. పరిస్థితి ఇంకా అలాగే కొనసాగుతోంది. ఇటు నెలిమర్లలో పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీటు జనసేనకు వెళ్లడం, పార్లమెంట్‌ సీటు బిజెపికి పోయే పరిస్థితి ఏర్పడడంతో టిడిపి కేడర్‌ అంతర్మధనంలో ఉంది. ఈ నియోజకవర్గంలోనూ అంతర్గతంగా రెండు గ్రూపులు ఉన్నాయి. ఇందులో ఒక గ్రూపు వైసిపికి సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టే నియోజకవర్గ ఇన్‌ఛార్జి బంగార్రాజు మౌనం వీడడం లేదు. జనసేన అభ్యర్థికి మద్ధతుగా ప్రచారానికి వెళ్లడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరులో టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌ మధ్య దీర్ఘకాలికంగా కొనసాగుతునే ఉన్నాయి. తొలి నుంచీ వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుం టున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఇద్దరూ కలిసికట్టుగా పనిచేసే పరిస్థితి లేదని సాక్షాత్తు టిడిపి కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. వీరి అనైక్యత వైసిపికి వరంగా మారబోతుందని కూడా చర్చనడుస్తోంది. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఇప్పుడిప్పుడే అసంతృప్తి నుంచి బయటపడినప్పటికీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీష్‌, అభ్యర్థి విజయ చంద్ర ఒకరినొకరు పట్టించుకోవడం లేదు. ఈరకమైన మనస్పర్థలను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో వైసిపి నిమగమైంది. కురుపాంలో మరో విచిత్రమైన పరిస్థితి. అభ్యర్థి తోయక జగదీశ్వరికి సీనియర్‌ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆశీస్సులు ఉన్నప్పటికీ ఆయన వృద్ధాప్యంలో వున్నారు. ఆయన ప్రియశిశ్యుడు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దత్తి లక్ష్మణరావు మరో నాయకుడికి టిక్కెట్‌ వస్తుందని ఆశించారు. ఖంగుతిన్న ఆయన ఇప్పటికీ జగదీశ్వరి తరపున ప్రచారంలో పాల్గొనకపోవడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అటు పాలకొండ నియోజకవర్గంలో మొత్తం ఆరుగురు ఆశావహులు ఉండడంతో అభ్యర్థి ఎవరనేది నేటికీ అధిష్టానం తేల్చలేని పరిస్థితి నెలకొంది.

➡️