టిడిపి షూరిటీలు ఉత్తివే

Dec 13,2023 21:36

ప్రజాశక్తి-సాలూరు  :   గ్యారెంటీ లేని టిడిపి షూరిటీలు ఉత్తుత్తివేనని డిప్యూటీ సిఎం రాజన్నదొర కొట్టిపారేశారు. రైతులను మోసం చేసిన టిడిపి అధినేత చంద్రబాబును నమ్మొద్దని కోరారు. బుధవారం మండలంలో రూ.35 లక్షలతో నిర్మించిన సారిక సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రాష్ట్రానికి ఎందుకు జగనే కావాలి కార్యక్రమంలో భాగంగా వైసిపి జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ హయాంలో నిర్మించిన పంచాయతీ భవనాలు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. రైతులు, మహిళలను మోసం చేసిన చంద్రబాబుని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామని చెప్పి నిలువునా మోసం చేసిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనని విమర్శించారు. కొటియా గ్రామాల విషయంలో ఎపి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం లేదని చెప్పారు. ఒడిశాతో ఉన్న జలవివాదాల కారణంగా కొంత సంయమనంతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సచివాలయ పరిధిలో రూ.15 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. 8 కోట్లతో దిగువ శెంబి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. 3.87 కోట్లతో సొంపిగాం వంతెన నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. మామిడిపల్లి, తోణాం రోడ్లను టిడిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో దశలవారీగా రోడ్లు, వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. టిడిపి నాయకులు చెప్పే మాటలు నమ్మవద్దని కోరారు. వైసిపి మళ్ళీ అధికారంలోకి రాకపోతే దళితులు, గిరిజనులే నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, వైసిపి మండల అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంతకుమారి, వైసిపి జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, సర్పంచ్‌ గొర్లి సత్యవతి, కోఆప్షన్‌ ఎంపిటిసి సభ్యులు సువార్తరావు, పిఆర్‌ ఇఇ ఎంవిఆర్‌ కృష్ణాజీ, పిఆర్‌ డిఇ చిన్నం నాయుడు, ఎంపిడిఒ జి.పార్వతి పాల్గొన్నారు.వంతెన పనులు పరిశీలన సారిక పంచాయతీ సొంపిగాం సమీపంలో స్వర్ణముఖి నదిపై నిర్మించనున్న వంతెన పనులను డిప్యూటీ సిఎం రాజన్నదొర పరిశీలించారు. 3.87 కోట్లతో నిర్మించనున్న వంతెన పూర్తయితే సొంపిగాం గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరిపోయే అవకాశం ఉంది. వంతెన నిర్మాణానికి నది సమీపంలో నిల్వ చేసిన నిర్మాణ సామగ్రి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో కాంట్రాక్టరు పనులను కొంత జాప్యం చేశారు. బుధవారం సారిక సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన రాజన్నదొర సొంపిగాం వంతెన నిర్మాణం గురించి పిఆర్‌ ఇఇ ఎంవిఆర్‌ కృష్ణాజీ, డిఇ శర్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, వైసిపి జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు సువ్వాడ రామకృష్ణ ఉన్నారు.వైసిపిలో పలువురు చేరిక పాచిపెంట గ్రామానికి చెందిన 30 దళిత కుటుంబాలు బుధవారం డిప్యూటీ సిఎం రాజన్నదొర సమక్షంలో వైసిపిలో చేరాయి. వైసిపి జిల్లా కార్యదర్శి డోల బాబ్జీ, సాలూరు వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ ఆధ్వర్యాన యజ్జల చిన గోవిందరావు నాయకత్వంలో టిడిపి నుంచి వైసిపిలో చేరారు. వారికి రాజన్నదొర పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆయన కోరారు.

➡️