టెన్త్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 16,2024 22:10

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  : పదో తరగతి పరీక్షలు ఈనెల 18నుంచి ప్రారంభమవుతాయని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. పరీక్షలు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. పదో తరగతి పరీక్షలపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పేజీపై క్యూ ఆర్‌ కోడ్‌తో 10 ప్రశ్నా పత్రం ఉంటుందని, ప్రశ్నా పత్రంపై విద్యార్థి రోల్‌ నెంబరు, బార్‌ కోడ్‌, మొదటి పేజీలో మైక్రో లెటర్‌, ప్రతి పేజీపై నిలువునా మూడు చోట్ల యునిక్‌ డిజిటల్‌ నెంబర్‌ ముద్రించి ఉంటుందని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్‌, ఫ్యాన్లు, ఏర్పాటు చేశామని చెప్పారు. మొబైల్‌ ఫోన్లు నిషేధిత ప్రాంతంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, విద్యుత్‌ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయని ఆయన తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు జరుగుతాయని తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు 5124 మంది బాలురు, 5410 మంది బాలికలు వెరసి 10,534 మంది రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు గతంలో ఉత్తీర్ణత కాని 664 మంది విద్యార్థులు కూడా హాజరు అవుతున్నారని చెప్పారు. 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్‌ అధికారుల నియామకం జరిగిందని, మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్‌ నిషేధిత ప్రాంతంగా పక్కాగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు ఈనెల 18 నుంచి 26 వరకు జరుగుతాయని, 712 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారని, 493 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరు అవుతారని చెప్పారు. 12 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో అన్ని ఉన్నత పాఠశాలలకు ”మై స్కూల్‌ మై ప్రైడ్‌” నినాదంతో దత్తత అధికారులను నియమించామని, ప్రతి వారం పాఠశాలను సందర్శించి మోటివెట్‌ చేశారని ఆయన అన్నారు. ఈ ఏడాది కూడా మంచి ఉత్తీర్ణత సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఇన్‌ ఛార్జ్‌ డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, డిఇఒ జి.పగడాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️