డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆపేదిలేదు : సిఐటియు

Jan 9,2024 16:15 #srikakulam

 ప్రజాశక్తి-ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె పోరాటం ఆపేదిలేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు అన్నారు. ఎచ్చెర్లలో అంగన్వాడీలు నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు గత 29 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నా జగన్మోహన్‌ రెడ్డి మొండి వైఖరి వీడకపోవడం దారుణమన్నారు. అంగన్‌వాడీల సంక్షేమం కోసం గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రంలోని మోడీ అమలు చేయడం లేదని తెలిపారు. అంగన్‌వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, బెదిరింపులు, నోటీసులు ఇవ్వడం మానుకొని తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐసిడిఎస్‌ సంస్థకు నిధులు పెంచాలని అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్బంధాలకు, అరెస్ట్‌లకు, కేసులకు అంగన్‌వాడీలు భయపడే వారు కాదని, ఇటువంటి ప్రభుత్వాలను అనేకం చూశారని వివరించారు. ఆమరణ దీక్షకైనా వెనకాడేది లేదని వారన్నారు. అంగన్వాడీలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. మెనూ చార్జీలు పెంచాలని, గ్యాస్‌ ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేసారు. గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలు అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ డ హెల్పర్స్‌ యూనియన్‌ నాయుకులు ఎమ్‌.శారద, వై.విజయలక్ష్మి, కె.ధనలక్ష్మి , పి.సరస్వతి, పి.రాములమ్మ, ఎమ్‌.రాధిక రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️