డి.బారామణికి బిటి రోడ్డు వేయాలి

Dec 29,2023 21:09

 ప్రజాశక్తి – కురుపాం  :  మండలంలోని డి.బారామణి గిరిజన గ్రామానికి బిటి రహదారి సౌకర్యం కల్పించే వరకు గిరిజన ప్రజల పక్షాన పోరాడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. శుక్రవారం మండలంలోని గాంధీనగర్‌ జంక్షన్‌ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డి.బారామణితో పాటు ఐదు గిరిజన గ్రామాలు సొంతంగా సేకరించుకున్న తమ నిధులతో కంకర రోడ్డు వేసుకున్నారన్నారు. స్వాతంత్రం వచ్చి నేటికి 76 ఏళ్లయినా ఇంతవరకు ఆ గ్రామాలకు కనీసం బిటీ రహదారి లేకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతంలోని అన్ని గిరిజన గ్రామాలకు బిటి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం.రమణ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని గిరిజనులంతా ఏకధాటిగా జగన్మోహన్‌రెడ్డికి ఓట్లు వేసి గెలిపించారని, పార్టీలు పరంగా చూడకుండా ప్రతి గిరిజన గ్రామానికి బిటి రహదారి సౌకర్యం కల్పించేలా స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంతవరకు రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాల ప్రజలతో కలిసి జనవరి 8న గుమ్మలక్ష్మీపురం ఐటిడిఎ డిఇ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, గిరిజన సంఘం నాయకులు ఎం.అడ్డమహేశ్వరరావు, బిడ్డక వెంకట్రావు, వూలక వాసు, అంగధ, వైకుంఠరావు, గిరిజనులు పాల్గొన్నారు.

➡️