తగ్గని అంగన్‌ ‘వేడి’

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. కేంద్రాలకు తాళాలు పగులగొట్టించడం, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటోంది. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. పులివెందుల టౌన్‌ : అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పగలగొట్టడం దారుణమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో అంగన్‌వాడీలు చేస్తున్న ధర్నాలో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం ఈనెల 12 నుంచి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలను మూసేసి పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల మేరకు జీతాలు పెంచాలన్నారు. ధరలకు అనుగుణంగా వేతనాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు పులివెందుల ఏరియా కార్యదర్శి గఫూర్‌, ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. చాపాడు :అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు శనివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా కోరుతున్నా ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోందన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనదువ్వూరు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నాలుగు రోజులుగా తమ డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా శనివారం వారు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ముద్దనూరు : రాష్ట్రాన్ని పరిపాలించడంలో జగన్‌ ఘోర వైఫల్యం చెందారని జమ్మలమడుగు టిడిపి ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో శనివారం ఆయన మద్ధతు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ ఉద్యోగులను, అంగన్వాడీలను మోసం చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రమణారెడ్డి, సత్తార్‌, రాజశేఖర్‌ యాదవ్‌, నాయుడు, కర్ణ, మాబు పాల్గొన్నారు. మైదుకూరు : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం మైదుకూరు సిడిపిఒ కార్యాలయం వద్ద చేస్తున్న ధర్నా నాలుగోరోజుకు చేరింది. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ధనలక్ష్మి, వెంకటసుబ్బమ్మ, కార్మికులు వేదమ్మ, లతా, లక్ష్మీదేవి పాల్గొన్నారు.బ్రహ్మంగారిమఠం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నాలుగు రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు శనివారం మైదుకూరు టిడిపి ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మద్దతిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిపాలన ఓ నియంతలా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు సునీల్‌, రాహుల్‌, దేవ, టిడిపి మండలశాక అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, పూజ శివయ్య, సుధాకర్‌, జయరామిరెడ్డి, మండల యువ నాయకులు శ్రీను పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, సిపిఐ సుబ్బరాయుడు, మంజుల, అంగన్వాడీ యూనియన్‌ కార్యదర్శి సుబ్బలక్ష్మి, అధ్యక్షులు రాణి, సువార్తమ్మ, నాగలక్ష్మి, గీత, రాజి, రామసుబ్బమ్మ, రాజుపాలెం సెక్టార్‌లో ఇందిర, లక్ష్మీదేవి, పద్మ, నిర్మల పాల్గొన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఎర్రగుంట్ల : అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని జమ్మలమడుగు టిడిపి ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరసన కార్యక్రమంలో శనివారం ఆయన మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు వేంపల్లె : అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం ఆగదని సిఐటియు, ఎఐటియుసి నాయకులు లలిత, సావిత్రి, సరస్వతి, శైలజా తెలిపారు. శనివారం వీరి సమ్మెకు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. పథకాలను కూడ రద్దు చేయడం శోచనీయమని అన్నారు. చాపాడు : చాపాడులో ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు శనివారం మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మద్దతు తెలిపి, తమ సంఘీభావం ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల శాఖ అధ్యక్షులు అన్నవరం సుధాకర్‌రెడ్డి, టిడిపి నాయకులు శేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రామాంజనేయులు, నాయబ్‌, రంతుల్లా, మధు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగు : ఎన్నికల ముందు అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ మాట తప్పారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. 5వ రోజు అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం, పట్టణ కార్యదర్శి దాసరి విజరు, సిపిఎం పట్టణ కార్యదర్శి జి.ఏసుదాస, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి, నర్సమ్మ, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. కడప : కడప అర్బన్‌, గ్రామీణ ప్రాజెక్టు కార్యాలయాలు ఎదుట నిరసన తెలుపుతున్న వారికి కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు వై. విష్ణు ప్రితమ్‌ రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విష్ణు ప్రితమ్‌ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలతోపాటు సామాన్య జనాన్ని కూడా ముఖ్యమంత్రి మోసం చేశారని విమర్శించారు. సిబ్బందిని వేదిస్తున్నారని, అసలు విధులు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాలకు వెళ్ళమంటున్నారని, వారికి గట్టి సమాధానం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు పిసిసి రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌, సీనియర్‌ నాయకులు వెంకటరమణారెడ్డి, ఆర్టీఐ రాష్ట్ర చైర్మన్‌ కోటపాటి లక్ష్మయ్య, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చెప్పలి పుల్లయ్య, మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్‌ మహమ్మద్‌ అలీ ఖాన్‌, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోపూరి శ్రీనివాసులు, ఎన్‌ఎస్‌ యుఐ జిల్లా అధ్యక్షులు మామిళ్ళ బాబు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్‌ ఖాన్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు మధు రెడ్డి, గౌరీ పాల్గొన్నారు. బద్వేలు : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై నిర్బంధం తక్షణమే ఆపి వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి అంగన్వాడి సెంటర్లపై దాడులు చేసి తాళాలు పగలు కొట్టిన వారిపై వెంటనే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్‌ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ అధ్యక్షులు ఎస్కే మస్తాన్‌ షరీఫ్‌, పట్టణ నాయకులు రమణారెడ్డి, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు. కడప అర్బన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి ఐదవ రోజుకు చేరుకుంది. సమ్మెకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధన్‌ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర, కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు విష్ణు ప్రియతమ రెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఐ. ఎన్‌. సుబ్బమ్మ, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సిపిఎం నగర కార్యదర్శి రామ మోహన్‌, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నగర అధ్యక్షులు సుంకర రవి, ఎస్‌టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటసుబ్బయ్య మద్దతు ఇచ్చారు.

➡️