తగ్గేదేలే..

Mar 27,2024 21:02

నారా లోకేష్‌తో చర్చలు విఫలం

ఇండిపెండెంట్‌గా గొంప కృష్ణ పోటీకి సిద్ధం

ఎస్‌.కోట, కొత్తవలసలో భారీ సభలకు సన్నాహాలు

ప్రజాశక్తి-శృంగవరపుకోట, వేపాడ  : చివరి వరకు టిక్కెట్‌ ఇస్తామని చెప్పిన పార్టీ అధిష్టానం తనకు వెన్నుపోటు పొడవడాన్ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటివరకు ఎమ్మెల్యే టిక్కెట్టు తనకే కేటా ఇస్తామని, నియోజకవర్గంలోకి వెళ్లి సంబరాల ఏర్పాట్లలో ఉండాలని తనను పంపించేసి వెంటనే కోళ్ల లలిత కుమారికి ఉమ్మడి అభ్యర్థిగా టికెట్‌ను ప్రకటించడంతో పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గొంప కృష్ణ తనకు మద్దతుగా ఉన్న నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో నియోజకవర్గ ప్రజలతో గత ఆదివారం పట్టణంలోని విశాఖ అరకు రహదారిలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు తాను ఇండిపెండెంట్‌గా నైనా పోటీ చేసి తీరుతారని ప్రకటించారు. ఈనేపథ్యంలో పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గొంప కృష్ణకు ఫోన్‌ చేసి విజయవాడ వచ్చి తనను కలవాలని ఆదేశించారు. గొంప కృష్ణ చంద్రబాబును కలవటానికి సమ్మతించకపోవడంతో సోమవారం యార్లగడ్డ మురళీకృష్ణ ఎస్‌.కోట వచ్చి గొంప కృష్ణతోను, ఆ గ్రూపు నాయకులతోను మాట్లాడారు. బి- ఫామ్‌ ఇచ్చేవరకు టిక్కెట్టు ప్రకటన శాశ్వతం కాదని, రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తాననడం సరికాదని, చివరి వరకు వేచి చూడాలని లేకుంటే సరైన నామినేటెడ్‌ పదవితో పార్టీలో ఉన్నత స్థానం కల్పిస్తారని తెలిపారు. అయినా గొంపకృష్ణ గ్రూపు నాయకులు ససేమిరా అనడంతో ఆ విషయాన్ని నారా లోకేష్‌ నారా లోకేష్‌కు మురళీకృష్ణ తెలిపారు. దీంతో లోకేష్‌ గొంపకృష్ణకు ఫోన్‌ చేసి తనను కలవాలని చెప్పడంతో కృష్ణతో పాటు గొంప వెంకటరావు, గొరపల్లి రాము, పైడి బాబు, రాయవరపు చంద్రశేఖర్‌ తదితరులు బుధవారం విజయవాడ వెళ్లారు. కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, మిగతానాయకులకు కూడా నామినేటెడ్‌ పదవులు ఇస్తామని, ఈ సారికి కోళ్ల లలిత కుమారిని గెలిపించాలని లోకేష్‌ కోరారు. గొంపకృష్ణ స్పందిస్తూ గతంలో విశాఖపట్నంలో అచ్చెంనాయుడు, బుద్ధ వెంకన్న సమక్షంలో చర్చలు జరిగినప్పుడు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని చెప్పారని, లలిత కుమారి, రాంప్రసాద్‌ అంగీకరించక పోయినప్పటికీ ఎమ్మెల్యే టికెట్‌ తనకే ఇస్తామని, నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. తమకు ఎమ్మెల్సీ వద్దని, ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, గెలిచి మళ్లీ వస్తామంటూ అక్కడి నుంచి వచ్చేశారు. ఎస్‌.కోట, కొత్తవలసలో భారీ సభలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌.కోటలో టిడిపి రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.

➡️