‘తడిగిరి’జనం గొంతెండుతోంది..!

'తడిగిరి'జనం గొంతెండుతోంది..!

తాగునీటి ఎద్దడిపై తడిగిరి వాసుల ఆందోళన

ఖాళీబిందెలతో మహిళల వినూత్న నిరసన

ప్రజాశక్తి – హుకుంపేట: తమ ఊరుపేరులోనే ‘తడి’ తమ గొంతెండిపోతోందని తడిగిరి వాసులు ఆవేదన చెందుతున్నారు. పాడేరు ఐటిడిఎకు కూతవేటు దూరంలో, హుకుంపేట మండల కేంద్రానికి అత్యంత చేరువలో ఉన్నప్పటికీ, తీవ్రమైన నీటి ఎద్దడితో ఏళ్ల తరబడి తాము అవస్థలు పడుతున్నామనిఅందోళన వ్యక్తం చేశారు. నేతలు, అధికారులు, నేతలకు మొరపెట్టుకున్నా, హామీలే తప్ప అమలు చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. గత ఎన్నికల్లోనూ మాటిచ్చి, అటకెక్కించారని, ఈసారి ఓట్ల కోసం వస్తే నిలదీసి కడిగేస్తామంటూ మండిపడుతున్నారు. గొంతెండుతున్నా తమ గోడు ఎవరికీ పట్టడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ, ఖాళీ బిందెలతో మంగళవారం నిరసన చేపట్టారు. మండలంలోని తడిగిరి పంచాయతీకేంద్రంలో తాగునీటి ఎద్దడి నివారించాలని గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. రెండేళ్ల క్రితం సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేసి, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని బోరు పాయింట్‌ తవ్వించారని, తర్వాత మిగిలిన పనులు చేయకపోవడంతో అదినేడు దిష్టిబొమ్మలా ఉందని మండిపడుతున్నారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయినీరు అందిస్తామన్న ప్రకటనలూ తమ గ్రామం దరిచేయడం లేదని వాపోతున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం తాము పడే అవస్థలు అన్నీఇన్నీకాదని, బిందుడు నీటి కోసం మైళ్లదూరం కాలినడకన వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని అంటున్నారు. తమ దుస్థితిని పదేపదే అధికారులు, నేతల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేదని మండిపడుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గ్రామానికి వచ్చిన నేతలకు తాగునీటి ఎద్దడి పరిష్కరించాలని కోరితే హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటైన మూడేళ్ల తర్వాత బోరు పాయింట్‌ తవ్వారని, తర్వాత సోలార్‌ యూనిట్‌,మోటారు అమరిక, ట్యాంకులు, పైపులైను, కుళాయిలు ఇతరత్రా పనులు చేపట్టకపోవడంతో బోరు పాయింట్‌ నిరుపయోగంగా ఉండగా, తాము దాహార్తితో అల్లాడుతూనే ఉన్నామని అంటున్నారు పొలాల్లోని ఊటకుంటలు, గెడ్డల్లోని కలుషితనీటికి తాగుతూ తాము కష్టాలు పడుతున్నా స్పందించే దిక్కులేదని మండిపడుతున్నారు. మాటిచ్చి, మోసపుచ్చిన నేతలు ఓట్లు అడిగేందుకు ఎలాగూ వస్తారని, వారిని నిలదీస్తామని అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి తడిగిరిలో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని గ్రామ మహిళలు విజయకుమారి, బాలమ్మ, నాగమణి, గౌరమ్మ, వరాలమ్మ, ఝాన్సీరాణి తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు.

తాగునీటి ఎద్దడిపై తడిగిరి వాసుల ఖాళీబిందెలతో ఆందోళన

➡️