తారుమారు తక్కెడమారు..! ‘తారుమారు తక్కెడమారు..

వీరివీరి గుమ్మడి పండు వీరి పేరేంటీ’ అనే చందంగా తయారైంది జిల్లాలో అధికార పార్టీ ఎంఎల్‌ఎ పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పు అధికార పార్టీ వైసిపిలో కలకలం సృష్టిస్తోంది. ఏలూరు జిల్లాలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు వైసిపి అధిష్టానం ఆయా సిట్టింగులకు తేల్చిచెప్పడంతో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చింతలపూడి ఎంఎల్‌ఎ ఎలిజాను ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగాలనడం ‘పొమ్మనలేక పొగబెట్టిన’ చందంగా తయారైందని ఆ నియోజకవర్గ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజుకు టిక్కెట్‌ లేదంటూనే కొత్త అభ్యర్థి ఎవరో సూచించాలనడం ఆ అభ్యర్థి గెలుపు బాధ్యత ఆయనపైనే పెట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏలూరు, ఉంగుటూరు, కైకలూరుల్లోనూ అభ్యర్థులను మార్చే యోచనల్లో వైసిపి అధిష్టానం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వైసిపి ఏలూరు జిల్లాలో కొత్త టీమ్‌తో బరిలోకి దిగుతున్నట్లే. ఏలూరులో మైనార్టీ అభ్యర్థికి టిక్కెట్‌ కేటాయిస్తే ఎలా ఉంటుందోనని.. అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే జగన్‌ పార్టీ పెట్టకముందు నుంచి అనుచరులుగా ఉన్న తెల్లం బాలరాజు, ఆళ్ల నానికి మొండిచెయ్యి చూపుతారా లేక వేరే పదవులు కట్టబెడతారా అనేది చర్చనీయాంశమైంది. అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ కూడా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వీరిలో ఎవరినైనా ఎంపీ స్థానానికి బరిలోకి దింపుతారో, కొత్త అభ్యర్థిని రంగంలోకి తీసుకొస్తారో వేచిచూడాలి.ఇక పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇన్‌ఛార్జుల మార్పుపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఆచంట, నరసాపురం సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలను వేరే స్థానాలకు పంపే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే క్షత్రియ సామాజిక తరగతికి మంత్రి పదవులు ఇవ్వకపోవడం, ఇతర కారణాల రీత్యా ఆ మార్పు ఉండదనే ప్రచారమూ మరోపక్క సాగుతోంది. ఇక పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గుడాల గోపీని ఇటీవలే నియమించినా ఆయనకు టిక్కెట్‌ దక్కే అవకాశాలు లేవనే ప్రచారం ఉంది. ఇక్కడ మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు అభ్యర్థిత్వాలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉండి టిక్కెట్‌ నామినేషన్ల ఘట్టం వరకూ సస్పెన్స్‌లో కొనసాగే అవకాశం ఉందని అక్కడి పరిశీలకులు చెబుతున్నారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గోకరాజు కుటుంబం నుంచి ఉంటారనే అంచనాలున్నాయి. అయితే ఇక్కడ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. మొత్తంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జీల మార్పు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపి అధినేత జగన్‌ సిట్టింగ్‌లను మార్చడం ద్వారా విజయబావుటా ఎగరేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ప్రతిపక్ష టిడిపిలోనూ కొంత గందరగోళం నెలకొంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పొత్తులో భాగంగా జనసేనకు ఏయే సీట్లు కేటాయిస్తారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఆచంట, తణుకు, పాలకొల్లు సీట్లపై ఎటువంటి ఇబ్బందీ లేదు. ఉండి టిక్కెట్‌ సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ మంతెన రామరాజుకు బదులు మాజీ ఎంఎల్‌ఎ వేటుకూరి వెంకట శివరామరాజు (శివ)కు కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం సీట్లలో కనీసం రెండైనా జనసేనకు ఇవ్వక తప్పదని తెలుస్తోంది. ఇదే జరిగితే ఆయా స్థానాల్లో టిడిపి ఆశావహుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఏలూరు జిల్లాలో కైకలూరు, ఉంగుటూరు, ఏలూరు, దెందులూరు స్థానాల్లో పెద్దగా ఇబ్బంది లేదు. నూజివీడు, పోలవరం, చింతలపూడి స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతోపాటు గ్రూపుల బెడద కూడా ఉంది. ఈ క్రమంలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో ఏదోక సీటు జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని, అలాగే ఉంగుటూరు, కైకలూరు సీట్లు సైతం జనసేనకు వదిలే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆశావహుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టిడిపి, జనసేన పొత్తులో జిల్లాలో ఎన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తారనేది తేలితే టిడిపి శ్రేణులకు స్పష్టత వచ్చి హుషారుగా పని చేసే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు అధికార పార్టీ వైసిపి, ఇటు ప్రతిపక్ష పార్టీ టిడిపిల్లోనూ ఒకింత గందరగోళ పరిస్థితులు ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

                                                                                                               -విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌

➡️