తుంగ్లాం రైౖల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన

తుంగ్లాం రైౖల్వే ఫ్లైఓవర్‌

ప్రజాశక్తి -గాజువాక : వడ్లపూడి, తుంగ్లాం రైల్వేగేటు వద్ద సేతు బంధన్‌ స్కీం నిధులు రూ.16 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి శుక్రవారం పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంతి అమర్‌ మాట్లాడుతూ, తుంగ్లాం రైల్వేగేటు వద్ద ఆటోనగర్‌ ,తుంగలాం, చుక్కవానిపాలెం, కాపు తుంగలాం, గొల్ల జగ్గరాజుపేట తదితర ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను సిఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి రైల్వేశాఖ నిర్మించిన వంతెనకు కొనసాగింపుగా మిగతా భాగాన్ని ఆర్‌అండ్‌బి నిధులు రూ.16కోట్లతో పూర్తిచేస్తామన్నారు.అవసరమైతే ఎపిఐఐసి నిధుల వినియోగిస్తామన్నారు. అనకాపల్లి, ఆనందపురం మార్గంలో ఫ్లైఓవర్‌ నిర్మాణాలు పూర్తయిన తర్వాత గాజువాకలో ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపడతామని, అలాగే విశాఖ నగరంలో 11ఫ్లైఓవర్ల నిర్మాణానికి డిపిఆర్‌ సిద్ధమైందన్నారు. నగర మేయర్‌ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఉరుకూటి చందు, 69వ వార్డు టిడిపి కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి పాల్గొన్నారు. శిలాఫలకంలో పేరుపై రగడతుంగ్లాం రైల్వేఫ్లైఓవర్‌ నిర్మాణానికి వేసిన శిలాఫలకంలో స్థానిక కార్పొరేటర్‌నైన తన పేరు లేదని69వ వార్డు టిడిపి కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి గొడవ చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకే శంకుస్థాపన స్థలికి చేరుకుని,మంత్రి, ఎమ్మెల్యే, మేయర్‌ రాకకోసం ఎదురుచూస్తున్న ఎపిఐఐసి, ఐలా పాలకవర్గాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఐలా చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా, అతనిని ఏకవచనంతో సంబోధించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈసందర్భంగా అసభ్యపదజాలంతో దూషణలు, చాలెంజ్‌లు చోటుచేసుకున్నాయి. దీనిపై ఇరువురు గాజువాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక సిఐ చొరవ చూపి, ఇరువురితో చర్చించి సమస్యను రాజీమార్గంలో పరిష్కరించారు.

➡️