తుపాను బీభత్సం!

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : తుపాను ప్రభావంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కుండపోతగా వర్షం కురుస్తోంది. రాత్రి పొద్దు పోయేవరకు వర్షం కొనసాగింది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బాపట్ల వద్ద తుపాను తీరం దాటడంతో భీకరమైన గాలులతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుంటూరు పచ్చిమ మండలంతో పాటు, పెదకాకాని, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో వర్షాలు వలన ఇళ్లల్లోకి నీరు రావడంతో 750 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికి రాత్రి బస ఏర్పాటు చేశారు. ఆహార పానీయాలను అందించారు. గుంటూరు జిల్లాలో పంటలకు అపార నష్టం జరిగింది. గాలులకు వరి పైరు నేలకొరిగింది. వరి పంట కోసి పనలపై ఉండగా వర్షాలకు నీటమునిగింది. వరితోపాటు పత్తి, మిర్చి, శనగ, ఆపరాలు పొగాకు పంటలకు అపార నష్టం వాటిల్లింది. రెండు జిల్లాల పరిధిలో లక్ష ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాలు ఆధారంగా తెలుస్తోంది. వరి తడిసిపోయి రంగు మారే అవకాశం ఉంది. ఇందువల్ల రైతులకి నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెనాలి డివిజన్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు గాలుల వల్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గుంటూరు, తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొన్నూరు వద్ద ఫీడర్‌లు విరిగి పడిపోవడంతో రాత్రి వరకు సరఫరా పునరుద్ధరణ జరగలేదు. భారీ వర్షాలకు రహదారులన్నీ దెబ్బతిన్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలకు ప్రజలు బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలుగు రోజులుగా వ్యవసాయ కార్మికులు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో నిర్మాణరంగం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రంగంలో పని చేస్తున్న కార్మికుల ఉపాధి దెబ్బతింది. గుంటూరు మీదగా నడిచే పలు రైలు రద్దయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల్లేక వెలవెలబోయాయి. వ్యాపారం లేక చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టాన్ని చవిచూసవారు. గుంటూరులోని పేదల నివసించే అనేక కాలనీల్లో మురుగునీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా చలిగాలులు తీవ్రమయ్యాయి. వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. గణపవరం వద్ద కప్పగంజి వాగు పొంగి ప్రవహించింది. చిలకలూరిపేట వద్ద పొగాకు పంట నీట మునిగింది. గుంటూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి ఆహారం అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావంతో గత 36 గంటలుగా జిల్లాలో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున మండలస్థాయి ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లుల, ఎంపిడిఒను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మ్యాట్‌లతో పాటు, విద్యుత్‌ సౌకర్యం, మరుగుదొడ్లు వసతులు కల్పించాలన్నారు. వేడి వేడి ఆహారంతో పాటు, చిన్న పిల్లలకు పాలు సరఫరా చేయాలన్నారు. బుధవారం ఉదయం కూడా వారికి ఆహారం అందించాలన్నారు.

➡️