తుపాను హెచ్చరికలతో కలవరం

తుపాను

ప్రజాశక్తి-యంత్రాంగం తుపాను హెచ్చరికలతో రైతుల్లో కలవరం ప్రారంభం అయ్యింది. పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అమలాపురం తుపాను నేపథ్యంలో తీరప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి నిర్వహించకూడదని ఎస్‌పి శ్రీధర్‌ హెచ్చరించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సముద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. సముద్ర స్నానాలు పేరు చెప్పి సముద్రంలో దిగడం కూడా ప్రమాదకరం కాబట్టి అటువంటివి కూడా అనుమతించబోమన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో ఇటువంటి వాటిని అనుమతించవద్దని జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే అన్ని శాఖల వారికి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ ఉత్తర్వులను అమలు పరచవలసిందిగా జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ అధికారులందరినీ ఆదేశించినట్టు తెలిపారు. మామిడికుదురు తుపాను హెచ్చరికలతో రైతులు గత రెండు రోజుల నుంచి పంటలను కాపాడుకోవటంలో నిమగమయ్యారు. మామిడికుదురు మండలంలో 2,410 ఎకరాల్లో వరి సాగు చేసారని ఎఒ బి.మృదుల తెలిపారు. నాట్లు ఆలస్యం కావడంతో కోతలు 249 ఎకరాల్లో పూర్తి కాగా 60 ఎకరాలు కుప్పలుగా పోశారన్నారు. మూడు రోజులు పాటు భారీ వర్షాల హచ్చరికలతో కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. కరవాకలో అలజడి సముద్ర తీరప్రాంతమైన కరవాకలో మూడు రోజుల నుంచి ఈదురు గాలులు వీసుండటంతో ఆ ప్రాంత వాసులు అందోళన చేందుతున్నారు. 140 బోట్లు లంగరు వేశారు. సుమారు 800 మంది మూడు రోజులనుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. ఈదురు గాలులు త్రీవత దత్యా అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఆత్రేయపురం బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా వీస్తున్న గాలులకు మండలంలోని గ్రామాలలోవరి పంట నేల నటింది. దీనికి తోడు ఉద్యానవన పంటలు అపార నష్టం వాటిల్లింది అరటి తోటలు నేలలుంటాయి. ఆదివారం ఉదయం నుంచి వీస్తున్న భారీగాలులకు పంట పొలాలలో విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి జనజీవనం స్తంభించింది. లొల్ల నుంచి ఆత్రేయపురం వెళ్లే రహదారిలో కొబ్బరి చెట్లు రహదారిపై పడిపోవడంతో ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. ఉప్పలగుప్తం తుపాను హెచ్చరికలు నేపథ్యంలో రైతులు మరికొన్ని రోజులపాటు కోతలను వాయిదా వేసుకోవాలని, కోసిన పంటను పొలాల నుంచి తక్షణమే పొడి ప్రదేశాలకు తరలించుకోవాలని అమలాపురం ఆర్‌డిఒ జి.కేశవవర్ధనరెడ్డి సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి, వ్యవసాయ అధికారి జి.కుమార్‌ బాబుతో కలిసి ఆయన పర్యటించారు. రైతులను అప్రమత్తం చేశారు. నూర్పిడి చేసిన 550 క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు అధికారులు తరలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. వారి వెంట ఆర్‌ఐ, ఎంవి.రమణ, విఆర్‌ఒలు ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా మండలంలోని తీర గ్రామాలైన ఎస్‌.యానాం, వాసాలతిప్ప, ఎన్‌.కొత్తపల్లి, రాఘవులపేట తీరంలో అలజడి నెలకొంది. తీర ప్రాంత వాసులు వీస్తున్న బలమైన ఈదురు గాలులకు భయాందోళన చెందుతున్నారు. తుపాను కారణంగా సముద్రతీరం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగసపడుతున్నాయి. ఎస్‌.యానాం, వాసాలతిప్ప తీరంలో సముద్రపు ఒడ్డున పూరిపాకలు వేసుకుని జీవిస్తూ సముద్రంపై వేట సాగించే వలస మత్స్యకారులు అధికారుల హెచ్చరికలతో వేటలేక ఒడ్డుకే పరిమితమయ్యారు. ఆదివారం వలస మత్స్యకారుల దగ్గరకు తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి, విఆర్‌ఒ మహాదశ శ్రీరామ్‌, సిబ్బంది వెళ్లి మాట్లాడారు. పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు. తుపాను ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని తహశీల్దార్‌ కార్యాలయంలో 24 గంటలూ పని చేసే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తహశీల్దార్‌ వెంకటేశ్వరి తెలిపారు.

➡️