తూర్పు కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

Jan 27,2024 20:39

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తూర్పుకాపులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని, తూర్పు కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు తూర్పు కాపులకే కేటాయించాలని తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్‌ డిమాండ్‌ చేసారు. ఆ సంఘం ఆధ్వర్యంలో మయూరి కూడలి వద్ద చేపట్టిన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమంలో చంద్రమోహన్‌ మాట్లాడారు. తూర్పుకాపులను బిసి-డి నుండి బిసి-ఎ లోకి చేర్చాలని, 7శాతం ఉన్న రిజర్వేషన్‌ ను 12 శాతానికి పెంచి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ చేసారు. ఇప్పటివరకు పదవులు అనుభవించిన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలెవరూ తూర్పు కాపులకు న్యాయం చెయ్యలేదని విమర్శించారు. తూర్పు కాపులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా వారికి ఒబిసి స్టేటస్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ పార్టీలన్నీ తూర్పుకాపు సామాజిక వర్గ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, లేని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆత్మగౌరవ దీక్షకు జనసేన పిఎసి సభ్యులు పడాలఅరుణ, వైసిపి నాయకులు పిళ్లా విజయకుమార్‌ తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం విజయనగర నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన సంతోష్‌ కుమార్‌ నాయుడు, సంఘ నాయకులు రాజారావు, మురళీ, బెల్లాన శివశంకర్‌ ఇతర తూర్పు కాపు నాయకులు పాల్గొన్నారు.

➡️