తెలుగు మహాసభ పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 24,2023 23:43
తెలుగు మహాసభ

ప్రజాశక్తి -దేవరపల్లి
ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగే 2వ ప్రపంచ తెలుగు మహాసభ కరపత్రాన్ని గోపాలపురం నియోజకవర్గం ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో సంచాలకులు అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన గజల్‌ శ్రీనివాస్‌ ఆది వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగు మహా సభలకు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. తెలుగు వైభవాన్ని తెలుగు కమ్మదనాన్ని అంతర్జాతీయంగా తెలపాలన్నారు. నూతన విద్యా విధానం ప్రకారం మాతృ భాషలోనే విద్యా విధానం జరగాలన్నారు. అప్పుడే విద్యార్థులు బోధన అంశాలను సులువుగా నేర్చుకోగలరన్నారు. రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకం జరిగి వెయ్యి సంవత్సరాలైన సందర్భంలో నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం కోసం శ్రీకారం చేపట్టివెయ్యి సంవత్సరాలైనా సందర్భంగా రాజమహేంద్రవరంలో ఈ తెలుగు మహాసభలు జరపడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు భాషాభిమానులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమం దేవరపల్లి సహసంచాలకులు రాజకుమార్‌ ఇంట్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ సహ సంచాలకులు బండి సూర్యప్రకాష్‌రావు, ఎంఎస్‌ చల్లారావు, చీమకుర్తి సత్యనారాయణ, కురం శ్రీనివాస్‌, దోబకుంట్ల రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️