త్వరలో అంతర్గత శాఖల క్రీడలు : కలెక్టర్

Dec 12,2023 23:42 #కలెక్టర్‌
త్వరలో అంతర్గత శాఖల క్రీడలు : కలెక్టర్

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం స్థానిక పుష్కరవనంలో జిల్లా అధికారుల కార్తీక వన మహోత్సవంలో కలెక్టర్‌ మాట్లాడారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగుల్లో మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన కార్తీక వన సమారాధనలో అధికారులు, అన్ని స్థాయిల్లోని సిబ్బంది పాల్గొని వారి ప్రతిభ కనబరిచిన తీరు ప్రశంసనీయం అన్నారు. తొలి నాళ్లలో కలెక్టరేట్‌ ఏర్పాటైన సమయంలో ఎదుర్కొన్న సవాళ్ళను అధిగమించడం ద్వారా నేడు కలెక్టరేట్‌కు ఇతర జిల్లా స్థాయి కార్యాలయాలకు ఒక రూపు తీసుకుని వచ్చినట్టు చెప్పారు. మరింతగా అధికారుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నంలో ఇటువంటి సామూహిక కలయికల వల్ల అంతా ఒకటే అనే భావన కలుగుతుందని కలెక్టర్‌ అన్నారు. క్రీడల నిర్వహణకు జాయిన్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌ నేతృత్వం లో కోర్‌ కమిటీ వేసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మాధవీలత పేర్కొన్నారు. పురుషులు, మహిళా విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏయే క్రీడాంశాల్లో పోటీలు జరపాలో, ఏయే శాఖలను కలిపి బృందాలను ఏర్పాటు చేయాలో చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు విభాగం కూడా ఇందులో పాల్గొనాల్సి ఉందన్నారు. ఆద్యంతం క్రీడలను తిలకించిన కలెక్టరు మాధవీలత అధికారులు, సిబ్బందిలోను ఉత్సాహాన్ని నింపి ప్రోత్సహించారు. కలెక్టరు, జెసి, మున్సిపల్‌ కమీషనర్‌, ఎస్‌పి క్రికెట్‌, స్టార్‌ గేమ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్‌పి పి.జగదీష్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌. తేజ్‌ భరత్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు, ఆర్‌డిఒలు ఎ.చైత్ర వర్షిణి, కృష్ణ నాయక్‌, పర్యాటక శాఖ ఆర్‌డి వి.స్వామి నాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పి.సువర్ణ, ఎం.భాను ప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️