దద్దరిల్లిన కలెక్టరేట్‌

Jan 3,2024 23:17
కలెక్టరేట్‌ అంగన్‌వాడీల

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి

జిల్లా కలెక్టరేట్‌ అంగన్‌వాడీల నినాదాలతో దద్దరిల్లింది. అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకోవాలని, ఇదే పంథాలో జగన్‌ సర్కార్‌ ముందుకు వెళ్లితే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని వక్తలు హెచ్చరించారు. ఎపి అంగన్‌ వాడీ వర్కర్స్‌్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు, ఆయాలు కలెక్టరేట్‌కు నల్లని దుస్తులు ధరించి ప్రభుత్వ తీరును నిరసించారు. అంగన్‌వాడీల ఉద్యమంలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ అంగన్‌వాడీలకు ఇచ్చిన వేతనాలు పెంపు హామీని అమలు చేయమంటే వారిని వేధింపులకు గురిచేయడం ఎంతవరకూ సభబు అని ప్రశ్నించారు. మాట తప్పను మడమ తిప్పను అనే జగన్‌ హామీలు నెరవేర్చడంలో మాట తప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రభుత్వానికి నవరత్నాలు తప్ప వేరే రత్నం లేదని, జగన్‌ను నమ్మి ప్రజలు ఓట్లు వేసి 151 ఎంఎల్‌ఎ లను గెలిపించారని, ఆ ఓట్లు వేసిన ప్రజల్లో స్కీం వర్కర్లు, కార్మి కులు, ఉద్యోగులు ఉన్నారనే విషయాన్ని మరచి అధికారంలోకి వచ్చాక వారికి తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. సిఐ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేము ఉమామహేశ్వర రావు మాట్లా డుతూ రాష్ట్ర వ్యాప్తంగా 23 రోజులుగా లక్ష మందికి పైగా అంగన్‌ వాడీలు ఆందోళనలు చేస్తున్నారని, అయితే అంగన్‌వాడీలతో మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకారమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే గద్దె దిగాలని అన్నారు. గడిచిన 30 ఏళ్లలో సిఐటియు నీడన అంగన్‌వాడీలు చేసిన పోరాటాల చరిత్రను గుర్తు చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. నెలకు రూ.75ల వేతనం నుంచి ప్రస్తుతం రూ.11,500 వేతనం పొందారు అంటే ఎర్రజెండా నీడలో అంగన్‌వాడీలు చేసిన పోరాటం ఫలితమేనని అన్నారు. అంగన్‌వాడీలను వేధింపులకు గురిచేసిన ఏ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రాలేదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో అక్క, చెల్లెమ్మలు అంటూ నెత్తిన చేయి పెట్టారని, ఐదేళ్లు అధికారం ఇస్తే అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయ లేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ అంగన్‌ వాడీల న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. ఇదే పంథాతో ప్రభుత్వం అడుగులు వేస్తే అంగన్‌వాడీలు జగన్‌ సర్కార్‌కు తగిన గుణపాఠం తప్పక చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. మాణిక్యాంబ, కె.బేబీ రాణి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. సుందరబాబు, బి.రాజులోవ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.మూర్తి, కెఎస్‌వి రామచంద్రరావు, ఎస్‌ భగత్‌, కె.రామకృష్ణ, గంటి.కృష్ణ, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల.రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు భాస్కర్‌, ఎన్‌.రాజా. అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు బి.మార్త, ఎం.మార్త, మాలతి, సునీత, శారద, పుష్ప, దర్గాంబ, ప్రాజెక్ట్‌ లీడర్లు మరియు సెక్టర్‌ లీడర్లు, అంగన్‌వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️