దళితులపై పెరుగుతున్న దాడులు

దళితులపై

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యు.కొత్తపల్లివైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన ఆదివారం పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం యండపల్లి జంక్షన్‌ నుంచి వాకతిప్ప, కొత్తపల్లి, ఉప్పాడ, అమీనాబాద్‌, మూలపేట, కోనపాపేట మీదగా పర్యటించారు. త్రోట్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఉప్పాడలో బహిరంగ సభను రద్దు చేశారు. ఉప్పాడలో చేనేత కార్మికులు లోకేష్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చేనేత కార్మికుల పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు.టిడిపి ప్రభుత్వం రాగానే చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా పని చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉప్పాడ రింగ్‌ రోడ్‌లో మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూలపేట, కొత్త మూలపేట, కొనపాప పేట వాసులు నారా లోకేష్‌ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. అనంతరం ఎస్‌ఇజడ్‌ శీలంవారి పాకలు జంక్షన్‌ వద్ద దళిత గళం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దళితులను వైసిపి ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో వివరించారు. మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను వేధించి చంపేశారని, చీరాలలో కోవిడ్‌ సమయంలో మాస్క్‌ పెట్టుకోలేదని కిరణ్‌ను కొట్టి చంపారని గుర్తు చేశారు. పారు. నెల్లూరు నియోజకవర్గంలో దళిత మహిళ దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారన్నారు. తాడిపత్రిలో వైసిపి వేధింపుల వల్ల సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో 6వేలమంది దళితులపై దాడులు జరిగాయని తెలిపారు. కాకినాడలో దళిత డ్రైవర్‌ సుబ్రహణ్యంను కిరాతంగా హత్యచేసి డోర్‌ డెలీవరీ చేసిన ఎంఎల్‌సి అనంతబాబును ముఖ్యమంత్రి వెంటేసుకుని తిరుగుతున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుబ్రహ్మణ్యం హత్యకేసును సిబిఐకి అప్పగిస్తామన్నారు. దళితులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్‌ను పకడ్బందీగా అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ముఖాముఖిలో లోకేష్‌ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా కొత్తపల్లిలో విజయదుర్గ నాయీబ్రహ్మణ సేవాసంఘం ప్రతినిధులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులకు 50 ఏళ్లకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. లోకేష్‌ మాట్లాడుతూ ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందిస్తామన్నారు. హెల్త్‌ కార్డులు మంజూరు చేసి వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పాడ చేనేతలతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి అసమర్థ పాలన కారణంగా చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. టిడిపి హయాంలో చేనేత కార్మికులకు రూ.110కోట్ల రుణమాఫీ చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేసి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు మత్స్యకారులతో మాట్లాడుతూ మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకున్ననది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. వైసిపి మత్స్యకారులకు తీరని అన్యాయం చేసిందన్నారు. మత్స్యకారులకు పనిముట్లు, బోట్లను సబ్సిడీపై టిడిపి ఇస్తే, వైసిపి రద్దు చేసిందన్నారు. సముద్రంలో ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షలు ఇచ్చి ఆదుకున్నామని, వైసీపీ పాలనలో కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించే దిక్కు లేదని ఆరోపించారు. లోకేష్‌ వెంట టిడిపి మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌.వర్మ, టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్‌, జనసేన ఇన్‌ఛార్జి తంగేళ్ల ఉదరు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️