దాళ్వా పంటకు రైతులు సన్నద్ధం

Dec 18,2023 23:17 #దాళ్వా పంట
దాళ్వా పంటకు రైతులు సన్నద్ధం

ప్రజాశక్తి-రామచంద్రపురంతొలకరి పంట పూర్తయిన చివర్లో తుపాను తాకిడికి గురైనప్పటికీ వెంటనే తేరుకొని దాళ్వా పంటకు రైతులు సన్నద్ధం అయ్యారు. ఈ మేరకు రామచంద్రపురం మండలంలో పలు గ్రామాల్లో రబీ పంటకు రైతులు దమ్ములు ప్రారంభించారు. ప్రతి ఏటా గోదావరి ప్రాంతాల రైతులు తొలకరి పంట కంటే దాళ్వా పంటకు అధిక ప్రాధాన్యతనిస్తారు. తొలకరిలో వాతావరణం భారీ వర్షాలు తుపానులతో రైతులకు అంత అనుకూలించదు. దీంతో తొలకరిలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వాతావరణం పొడిగా వరి పంటకు అనుకూలంగా ఉండడంతో ప్రధానంగా అధిక పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తారు. రబీ పంటకు ఎక రాకు 60, 70 బస్తాలు పండే విధంగా రైతులు నిరంతరం శ్రమిస్తారు. ప్రకతిపై ఆధారపడిన వ్యవసాయం దాళ్వాలో అధిక పంటలు పండించి నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతులు అధిక పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడరు. ప్రస్తుతం రామచంద్రపురం మండలంలో 400 ఎకరాల్లో ఇప్పటికే రైతులు విత్తనాలు వెదజల్లుకున్నారు. మరోవైపు వ్యవసాయ అధికారులు రైతులను విత్తనాలు వెదజల్లు కునేందుకు ప్రోత్సహిస్తున్నారు. వెదజల్లుకోవడం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా కూలి పనులు ఖర్చులు కలిసొచ్చే అవకాశం ఉంది. వెదజల్లుకునే వరిచేలకు కాలిబాటలు వదలడం నీరు వథా కాకుండా చర్యలు తీసుకోవడం వంటి విషయాలపై వ్యవసాయ అధికారులు రైతులకు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. డిసెంబర్‌ నెలాఖరులోగా రైతులు విత్తనాలు వెదజల్లుకోవడం పూర్తి చేయాలని, మార్చి నెలాఖరులోగా దాళ్వా పంటలు పూర్తి చేసుకునేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మార్చి నెలాఖరులోగా పంటలకు పూర్తిగా సాగునీరు అందే అవకాశం ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి, ఏప్రిల్‌ నెలలో పంట చేతికి వచ్చే విధంగా సమాయత్తం అవుతున్నారు. వేగంగా చేతికొచ్చే వరి వంగడాలను ఉపయోగించాలని అధికారులు రైతులకు తెలియజేస్తున్నారు.

➡️