ధాన్యం కొనుగోలుపై రైతులు అధైర్య పడొద్దు : ఆర్‌డిఒ

ప్రజాశక్తి – పెదపాడు

మించౌంగ్‌ తుపాను నేపథ్యంలో రైతులు ధాన్యం గురించి అధైర్యపడొద్దని ఏలూరు ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలి అన్నారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు సోమవారం పెదపాడు మండలం వట్లూరు, పెదపాడు గ్రామాల్లో ఆర్‌డిఒ ఖాజావలి పర్యటించి ధాన్యం కొనుగోలు, కల్లాల్లో పంట పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పెదపాడు రైతు భరోసాకేంద్రంలో ధాన్యం కొనుగోలుకు అందుబాటులో ఉన్న వాహనాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వట్లూరులో పంట పరిస్థితిని ఆయన పరిశీలించారు. సిఎం జగన్‌ ఆదేశాలతో రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సరళతరమైన విధానాన్ని అవలంభించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో పిపిసిల్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వారికి తోడుగా నిలబడుతుందన్నారు. రోడ్డుపక్కన ఆరబెట్టిన ధాన్యాన్ని లారీల్లోకి లోడింగ్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. పెదపాడు మండలం నుంచి సుమారు వంద మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించామని తెలిపారు. తుపాను ప్రభావం వల్ల ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులను, అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. వీరివెంట తహశీల్దారు జి.విజరుకుమార్‌, వ్యవసాయశాఖ అధికారి ప్రదీప్‌, విఆర్‌ఒలు, వ్యవసాయశాఖ అసిస్టెంట్లు ఉన్నారు.

➡️