నగరాభివృద్ధికి సహకరించండి : మేయర్‌

Mar 4,2024 21:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని మేయరు వి.విజయలక్ష్మి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ సమావేశం మందిరంలో మేయర్‌ అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. మొత్తం అజెండాలో పొందుపరిచిన 40 అంశాలకు ఆమోదం లభించింది. సమావేశంలో అజెండాలోని అంశాలను ప్రస్తావిస్తూ, సమీక్షిస్తూ అవసరమైన సలహాలు సూచనలను ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌వివి రాజేష్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంల ఓ వైపు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మరోవైపు అభివృద్ధి, సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వేసవి దృష్ట్యా బోర్లు మరమ్మతలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. నూతనంగా చేపట్టబోయే పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసామన్నారు. మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతో నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అభివృద్ధి సుందరీ కరణ పనుల పరిరక్షణకై అవసరమైన అధనపు సిబ్బందిని నియమించేందుకు నిర్ణయించామన్నారు. సమావేశంలో కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు, సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమలరావు, కార్పొరేటర్లు పట్నాన పైడిరాజు, బోనెల ధనలక్ష్మి, పిన్నింటి కళావతి, వివిధ భాగాల అధికారులు, పాల్గొన్నారు.

➡️