నత్తనడకన నాడు-నేడు పనులు

పునాది దశలోనే నిలిచిపోయిన ధారవాడ పాఠశాల భవనం

ప్రజాశక్తి-మారేడుమిల్లి

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకం కింద పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించి రెండేళ్లు దాటినా నేటికీ ఆ పనులు పూర్తి కాలేదు. మండలంలోని దొర చింతలపాలెం పంచాయతీ పరిధి ధారవాడ గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి రెండేళ్ల క్రితం ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద రూ.20 లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణానికి పునాదులు తీసి వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనులను సైతం అధికారులు పట్టించుకోకుండా నీరుగారుస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నిధులు ఉన్నాయా? లేదా? అనే అనుమానం కలుగుతుందని పలువురు గ్రామస్తులు అంటున్నారు. పాఠశాలకు భవనం లేకపోవడంతో విద్యార్థులకు గుడిసెలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధారవాడ గ్రామంలో పాఠశాల భవన నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️