నత్తనడకన మాతృవందన యోజన

Dec 7,2023 22:06
ఏ విడత రిజిస్ట్రేషన్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి

మాతృవందన యోజన కార్యక్రమం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. మాతాశిశు మరణాలు తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన (పిఎంఎంవివై) పథకాన్ని అమలు చేస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, బిడ్డలకు పౌష్టికాహారం, టీకాలు, మందులకు అవసరమైన నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఉమ్మడి తూర్పగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం జిజిహెచ్‌లతో పాటూ, ఏడు ఏరియా ఆస్పత్రులు, 27 సిహెచ్‌సిలు, 128 పిహెచ్‌సిలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ప్రతినెలా 800 నుంచి 900 వరకు గర్భిణులు నమోదు అవుతున్నారు. కాన్పులు కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయి. మాత వందన యోజన పథకానికి 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి నవంబర్‌ 30 వరకు 5,900 మంది దరఖాస్తు చేసుకోగా 5,028 మంది రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. వీరిలో 2442 మందికి ఆ పథకం ఫలాలు లభించాయి. రెండవ కాన్పులో ఆడపిల్ల పుట్టిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. ఆ విధంగా 4182 మంది దరఖాస్తు చేసుకోగా 2674 మంది రిజిస్ట్రేషన్‌ పూర్తయింది వీరిలో 1379 మందికి మాత్రమే పథకం ఫలాలు లభించాయి.వేధిస్తున్న సాంకేతిక సమస్యలు మహిళలకు వివాహమయ్యే వరకు పుట్టింటి పేరే ఉంటుంది. వివాహ అనంతరం పేరు మారుతుంది. అయితే ఆధార్‌ కార్డులోనూ పాత పేరే ఉండటంతో సమస్య ఎదురవుతోంది. కొందరు మనుగడలో లేని బ్యాంకు ఖాతా నంబర్లు ఇస్తున్నారు. ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌ అనుసంధానం కాకపోవడం, ఇకెవైసి లేకపోవడం వంటి వాటివల్ల పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. ప్రసవానికి మహిళలు పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీ. ఈ సమయంలో వివరాలు నమోదు కావడం లేదు. ఎఎన్‌ఎంలకు సమాచారం ఇవ్వకపోవడం, ఇచ్చిన వివరాలు అసంపూర్తిగా ఉండటంతో సాయానికి దూరమవుతున్నారు. సుమారు 20 శాతం మందికి అసలు ఈ పథకం ఉన్నట్లే సమాచారం కూడా లేదు.పథకం అమలు ఇలా ప్రధానమంత్రి మాతృ వందన యోజన 2017 జనవరి 1 నుంచి ప్రారంభమైంది. ఈ పథకం కింద గ్రామీణ గర్భిణులకు మొదటి కాన్పునకు రూ.6 వేలు, నగర వాసులకు రూ.5,600 ఇవ్వాలి. ఇప్పటి వరకు జిల్లాలో 1.10 లక్షల మందికి ఈ పథక ఫలాలు అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఆరు నెలలుగా గర్భిణుల విరాలు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. నమోదు అయినా చాలా మందికి డబ్బులు జమకాలేదు. విడతల వారీగా సాయం అందించాలి ఇలా గర్భం దాల్చిన 12 వారాల్లోగా పేరు నమోదు చేసుకుంటే రూ.1000 ఇస్తారు. అనంతరం 7 నెలల్లోగా టీటీ రెండు డోసులు, 200 ఐరన్‌ మాత్రలు వేసుకోవడం పూర్తయితే రూ.2 వేలు అందిస్తారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే రూ.600, గ్రామీణ మహిళలకు రూ.1,000 చొప్పున ఇస్తారు. అనంతరం పుట్టిన బిడ్డ జీరో డోసుతో మొదలుకొని నెలవారీ టీకాలు పెంటావాలెంట్‌ 3 డోసులు పూర్తయితే వారి ఖాతాలో రూ.2 వేలు జమ చేస్తారు. ప్రభుత్వం సాయాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తుంది. మొదటి, రెండు, నాలుగు విడతల బాధ్యత ఎఎన్‌ఎంలు చూస్తారు. మూడో విడత బాధ్యత ఆస్పత్రి అధికారులు పరిధిలో ఉంటుంది ఏ విడత రిజిస్ట్రేషన్‌ పూర్తయితే ఆ మేరకే డబ్బులు జమవుతాయి.

➡️