నల్లమడ వాగుకు గండ్లు

Dec 7,2023 00:05

ప్రజాశక్తి-బాపట్ల: తుఫాను ప్రభావంతో నల్లమడ ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలకు వరదనీటి ఉధతి పెరిగింది. నల్లమడ వాగుకు రెండు చోట్ల బుధవారం గండ్లు పడ్డాయి. జిల్లెళ్ళ మూడి బ్రిడ్జి వద్ద పిటి ఛానల్‌కు మధ్య, నల్లమడ వాగు కట్ట మట్టిని గతంలో తొలగించడంతో మరింత బలహీన పడి అక్కడ గండి పడే అవకాశాలు ఉన్న దష్ట్యా రూరల్‌ సీఐ వేణుగోపాలరెడ్డి, ఎఎంసి మాజీ చైర్మన్‌ గవిని కష్ణమూర్తి పర్యవేక్షణలో ఇసుక బస్తాలతో వరద నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. చెరువు జమ్ములపాలెం, శివారు చెరువు ఉప్పరపాలెం సమీపంలో నల్లమడ డ్రెయిన్‌ మలుపు వద్ద గండిపడటంతో వరదనీరు సాగునీటి కాలువైన పీటి ఛానల్‌లోకి ప్రవహిస్తోంది. గండిపడిన ప్రాంతంలో అడ్డు కట్ట వేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు జెసిబితో విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇదే గండికి మరో వంద మీటర్ల దూరంలో మరో గండి పడింది. రెండో గండిని పూడ్చేందుకు జెసిబి సైతం అక్కడికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. పోలీస్‌ అధికారులు తప్ప సాయంత్రం వరకు గండ్లు పడిన ప్రాంతాలకు అధికారులు ఎవ్వరూ రాలేదని రైతులు చెబుతున్నారు. డ్రైనేజీ శాఖకు చెందిన అధికారులు ఏఈ తప్ప మరెవరూ కనిపించలేదు. డ్రైనేజీ ఏఈ భరద్వాజ నల్లమడ వాగుకు పడిన గండ్లు పూర్చేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని విలేకరులు వివరణ కోరారు. డిఈ స్థాయి అధికారి తప్ప తాము ఏం చేస్తున్నామని చెప్పే అధికారం లేదని తెలిపారు. వరద ఉధతి పెరిగితే నల్లమడ వాగుకు మరికొన్ని చోట్ల గండ్లు పడే అవకాశం ఉందనిరైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లమడ వాగు డిజైన్‌ చేసిన దానికంటే వరద స్థాయి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. డ్రైనేజీ అధికారుల పాపం రైతులకు శాపం అయిందని రైతుల ఆరోపిస్తున్నారు. నల్లమడ డ్రెయిన్‌ కట్టలు మట్టిని తరలిస్తున్నా ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. వరద ఉధతి పెరిగి నల్లమడ వాగు కట్టలు తెంచుకుంటే పంటతోపాటు మూలపాలెం గ్రామానికి ముప్పు పట్టిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి నల్లమడ వాగు కట్టలు తెంచుకున్న ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికపై మరమ్మత్తులు చేపట్టి వేలాది ఎకరాల్లో వరి పంటను కాపాడాలని కోరుతున్నారు.

➡️