నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

అమరావతి: ఇటీవల కురిసిన మిచాంగ్‌ తుపాను కారణంగా మండలంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అమరావతి మండల పరిధిలోని మునుగోడు, నరుకుళ్ళపాడు సచివాలయ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సం ఘాల కన్వీనర్‌ బి.సూరిబాబు మాట్లాడుతూ అమరావతి మండల పరిధిలో వాగు పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. శనగ, కంది, మినుము, పత్తి, మిర్చి పంటలు వేసిన రైతులకి నష్టం జరిగిందని అన్నారు. ప్రభుత్వం దెబ్బతిన్న పంటలను అధికారులు సర్వే చేసి నష్టపోయిన రైతుల పేర్లు ఆర్బికే వద్ద లిస్ట్‌ పెట్టాలని, నమోదు కాని పొలాలకు రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని రైతులు సమక్షంలో చేయాలని, నష్టపోయిన కౌలు రైతుల పేర్లు నమోదు చేయాలని,ఈ-క్రాపు నమోదు కాని పంటలు కూడా పరిహారం ఇవ్వాలని అన్నారు. రబీలో వేసిన పంటలన్నీ ఈ-క్రాపులో నమోదు చేయాలని అన్నారు. నష్టపోయిన పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పెట్టు బడులు సగభాగం పరిహారాన్ని చెల్లించాలని అన్నారు. ఆహార పంటలకు రూ.20 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేలు అందజేయాలని,ఖరీఫ్‌ రబీలో వేసిన పంట లకు ఉచిత పంటల బీమా ప్రకారం ప్రీమీయం ప్రభుత్వం చెల్లించాలని, అన్ని పంటలకు బీమా పరిహారాన్ని అందిం చాలని కోరారు. కార్యక్రమంలో సయ్యద్‌ మొహిద్దీన్‌ వలి, షేక్‌ రఫీ,బెల్జేపల్లి పౌలు తదితరులు పాల్గొన్నారు

➡️