నాణ్యత ప్రమాణాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన

Mar 5,2024 21:41

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : పంచాయతీలలో జరిగే పనులపై వినియోగించే వస్తువుల నాణ్యత ప్రమాణాలపై ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, పంచాయితీక ార్యదర్శులకు అవగాహన ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ అన్నారు. స్థానిక మండల కార్యాలయ సమావేశ మందిరంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ నాణ్యత ప్రమాణాలపై జిల్లా వ్యాప్తంగా సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు నాలుగు రోజులపాటు వర్క్‌ షాపు నిర్వహించారు. మంగళవారం రెండో రోజు వర్క్‌ షాపును పరిశీలించిన ఆయన భారత ప్రమాణాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గ్రామస్థాయికి తీసుకు వెళ్లడానికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ పంచాయతీరాజ్‌ శాఖతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ వర్క్‌షాపు ద్వారా ఐఎస్‌ఐ, హాల్‌ మార్క్‌ వంటి నాణ్యతా ప్రమాణాల ప్రాముఖ్యతతో పాటు వాటి పరిధిలో వచ్చే వస్తువుల వినియోగం గురించి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అవగాహన పెంపొందించుకొని ప్రజలకు తెలియజేయా లన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం మార్చి 7 వరకు నిర్వహిస్తామన్నారు. అనంతరం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ జాయింటు డైరెక్టరు సుజాత, భారత ప్రమాణాల ప్రాధాన్యతను వాటి పరిధిలోకి వచ్చే వస్తువులను, హాల్‌ మార్కు ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపిడిఒ అకిబ్‌ జావేద్‌, డిఎల్‌పిఒ ఎం.నాగభూషణ, డిపిఆర్‌సి ట్రైనింగ్‌ మేనేజరు ఎ.దేవుడు, ఆర్‌పిలు ఎ.గణపతి, ఎం.రఫీ, వెంకటరమణ, డిఎల్‌సి పి.అచ్చుతరావు తదితరులు పాల్గొన్నారు.

➡️