నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి : టెక్నికల్‌ డైరెక్టర్‌

ప్రజాశక్తి- రాయచోటి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నాణ్యమైన విద్యుత్‌ సేవలను అందించాలని విద్యుత్‌ శాఖ టెక్నికల్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.సుబ్బరాజు పేర్కొన్నారు.మంగళవారం ఆయన పట్టణంలోని విద్యుత్‌ శాఖ డివిజనల్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు విద్యుత్‌ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను అందించాలని సూచించారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతులకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించడంతో పాటు 11 కె.వి లైన్లు ఓవర్‌ లోడ్‌ లేకుండా చూసుకోవాలన్నారు. 33 కెవి లైన్లు మెయిన్టెనెన్స్‌ చేసుకుంటూ విద్యుత్‌ సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడూ చూసుకోవాలన్నారు. విద్యుత్‌ బిల్లుల బకాయిలను నిర్లక్ష్యం చేయకుండా వసూలు చేయాలని, రైతులకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే సకాలంలో స్పందించి పునరుద్ధరించాలని ఆయన సూచించారు. అనంతరం రాయచోటి విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని సంబేపల్లి మండలం దేవపట్ల 33/11 కెవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను తనిఖీ చేసి, మండ లంలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును ఇవ్వాలని రైతులకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని, రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇఇ చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు చాంద్‌బాషా, విజయకుమార్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, అకౌంట్‌ ఆఫీసర్‌ పాపయ్య, కమర్షియల్‌ ఎఇ నరేంద్రనాథ్‌ రెడ్డి, అన్ని మండలాల ఎఇలు, జెఇలు పాల్గొన్నారు.

➡️