నానుతున్న పంటలు

తెనాలి మండలంలో కూలిపోయిన అరటి తోట
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి: మిచౌంగ్‌ తుపాను సృష్టించిన భీభత్సంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రెండు లక్షల ఏకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో లక్ష ఏకరాల్లో వరి పంట నీట మునిగి భారీ నష్టం కలిగింది. సోమ, మంగళ వారాల్లో కురిసిన భారీ వర్షాలకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రాథమికంగా రెండు లక్షల ఏకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటలకు అపార నష్టం జరిగింది. గాలులకు వరి పైరు నేలకొరిగింది. వరి పంట కోసి పనలపై ఉండగా వర్షాలకు నీట మునిగింది. నీటిలో తేలియాడుతున్న వరి పనలను కుప్ప వేస్తున్నారు. వరి తడిసిపోయి రంగు మారే అవకాశం ఉంది. పత్తి, మిర్చి, జొన్న, మొక్క జొన్న, శనగ, ఆపరాలు పొగాకు పంటలతోపాటు ఉద్యాన పంటలకు అపార నష్టం కలిగింది. అరటి తోటలు నేలకూలాయి. ఉల్లి, బొప్పాయి, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. రబీ సీజన్‌ ప్రారంభం కాగానే పల్నాడు, గుంటూరు జిల్లాలో సాగు చేసిన జొన్న, మొక్క జొన్న పైర్లు నీట మునిగాయి. ఈ పైర్లు ఎంతవరకు నిలదొక్కు కుంటాయో తెలియడం లేదు. పత్తి పంటలో రెండో విడత తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి నెలరాలిపోయింది. పూత, కాయలు రాలిపోతాయి. మెట్ట ప్రాంతాల్లో పత్తి, మిర్చి పొలాల్లో నీరు నిలిచి పైర్లు ఉరకెత్తుతున్నాయి. ప్రత్తిపాడు, మేడికొండూరు, ఫిరంగిపురం, తాడికొండ తదితర ప్రాంతాల్లో పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. పల్నాడులో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి కోతలకి సిద్ధంగా ఉండగా వర్షాలకు దెబ్బతిన్నాయి. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. పంట కాల్వల్లో కూడా నీరు భారీగా ఉండటంతో నీరు బయటకు పోవడం లేదు. దీంతో రైతులు పొలాల్లో ఉన్న నీటిని బయటకి పంపేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో పెదమద్దురు వాగు ఉధృతంగా ప్రవహించడంతో అమరావతి వద్ద పంటలు నీట మునిగిపోయాయి. రాజధాని ప్రాంతంలో కోటేళ్ల వాగు, తాడికొండ ప్రాంతంలో కొండవీటి వాగు, గణపవరం వద్ద కుప్పగంజి వాగు పొంగి ప్రవహస్తున్నాయి. వాగుల పరిసర ప్రాంతాల్లో పొలాల్లోకి నీరు చేరి పంటలకు నష్టం వాటిల్లింది. నెలరోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం 36 గంటల వ్యవధిలో కురిసిందని అధికారులు తెలిపారు. ఇందువల్ల పంట నష్టం ఊహించని విధంగా పెరిగిందని అంచనా వేస్తున్నారు.

➡️