నిరాశ

Feb 7,2024 21:12

  ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల వాసులను మరోసారి నిరాశకు గురిచేసింది. నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలకు కేటాయింపులు తప్ప, జిల్లా అభివృద్ధికి, తలసరి ఆదాయం పెంచేందుకు దోహడపడే విధంగా నిధులు కేటాయింపులు లేవు. ముఖ్యంగా 80శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయానికి అత్యంత కీలకంగా వున్న సాగునీటి రంగంపై ఎప్పటి మాదిరిగానే తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంతో ఈసారి బడ్జెట్‌లోనైనా జిల్లా అభివృద్ధికి దోహదపడే సాగునీరు, పారిశ్రామక, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తారని, గతం కంటే బడ్జెట్‌ పెంచుతారని జిల్లా ప్రజానీకం ఆశించారు. ఆచరణలో అటువటిదేమీ కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తోటపల్లి, రామతీర్థసాగర్‌ సాగునీటి ప్రాజెక్టులకు వందల రూ.కోట్లు కేటాయించాల్సి వుండగా గడిచిన నాలుగేళ్లలో అరకొరగా కేటాయించి, విడుదలలో మరింత కోత విధించారు. ఈసారి అటువంటి ఊరట కూడా కలగలేదు. అసలే విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు పారిశ్రామికంగా వెనుకబడివున్నాయి. జ్యూట్‌ పరిశ్రమలు దాదాపు మూతపడ్డాయి. ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు కొన ఊపిరితో నడుస్తున్నాయి. వీటిని ఆదుకునేందుకుగానీ, కొత్తపరిశ్రమల స్థాపనకుగానీ ఎలాంటి ప్రతిపాదనలు కూడా లేవు. మరోవైపు సేవారంగంలోనే జిల్లాకు తగిన కేటాయింపులు లేవు. ముఖ్యంగా వైసిపి అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. 64వేల ఎకరాల పాత ఆయుకట్టును స్థిరీకరిస్తూనే కుడికాలువ ద్వారా అదనంగా 1,31,221 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తోటపల్లి సాగునీటి ప్రాజెక్టును 2004లో చేపట్టారు. కేటాయించిన నిధుల్లోనూ విడుదలచేసిన మొత్తం ఇంకా తక్కువగానే ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు రూ.201.98 కోట్లు కేటాయించగా ఆచరణలో ఖర్చుచేసింది రూ.63.24కోట్లు మాత్రమే. ప్రస్తుత ధరలు, లెక్కల ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తిచేయడానికి 567.57కోట్లు అవసరం కాగా, ఈ ఏడాది తక్కువలో తక్కువగా రూ.161.96కోట్లు అవసరమౌతాయని సంబంధిత ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదన పంపినప్పటికీ, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులను ప్రభుత్వం ప్రకటించలేదు. ఇదే ప్రాజెక్టుకు గత ఏడాది నిర్మాణ పనులకు రూ.294.90కోట్లు, సిఎడిడబ్ల్యుఎం పనులకు రూ.107.69కోట్లు, భూసేకరణకు 46.38కోట్లు, అర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి రూ.107.06కోట్లు చొప్పున మొత్తం రూ.556.03కోట్లు కేటాయించాలని కోరుతూ ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపగా, కేవలం రూ.84.20కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులోనూ ఖర్చుచేసింది అక్షరాల ఆరు కోట్ల అరవై నాలుగు లక్షలు మాత్రమే. ఇలా ఏటా తగినంతగా విడుదల చేయకపోవడం వల్ల తరచూ కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెండింగ్‌ పనుల వల్ల సుమారు 68వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. తారకరామతీర్థసాగర్‌ జలాశయం, కాలువల నిర్మాణ పనులకు గడిచిన నాలుగేళ్లలో రూ.356.68కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆచరణలో రూ.143.52కోట్లతో సరిపెట్టింది. ఈ ఏడాది రూ.399.18కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. తాజా బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు నిధులపై స్పష్టత లేదు. గత ఏడాది కూడా నిర్మాణ పనులు, ఆర్‌అండ్‌ఆర్‌, భూసేకరణకు మొత్తం రూ.314.55కోట్లు కోరగా, రూ.60.62కోట్లు కేటాయించారు. ఈ రెండు ప్రాజెక్టులు తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన జంఝావతికీ అంతంత మాత్రంగానే నిధులు కేటాయించారు. గత ఏడాది జంఝావతికి రూ.39.60లక్షలు, వెంగళరాయసాగర్‌కు రూ.14.72లక్షలు, మడ్డువలసకు రూ.17.57లక్షలు మాత్రమే కేటాయించారు. తాటిపూడి, ఆండ్ర, పెద్దగెడ్డ, పెదంకలాం, డెంకాడ ఆనకట్టు, వట్టిగెడ్డ జలాశయాల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారమూ లేదు. జెఎన్‌టియు గురజాడ వర్శిటీలో అదనపు భవనాలు వంటి మౌలిక వసతుల కల్పనకు ఎటువంటి నిధులు లేవు. ఇలా ఒకటి కాదు… రెండు కాదు.. ఏకంగా అన్ని అంశాల్లోనూ జిల్లాకు ఒరిగిందేమీ కనిపించలేదు. కేటాయింపులన్నీ నవరత్నాలు, జగనన్న, వైఎస్‌ఆర్‌ పేరిట ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల పద్దుల్లోనే కనిపిస్తున్నాయి. వివిధ శాఖలకు కేటాయింపులు కూడా తగ్గడంతో ప్రభుత్వం చెప్తున్న సుస్థిరాభివృద్ధి మేడిపండేనంటూ పలువురు విమర్శిస్తున్నారు.

➡️