నిరుత్సాహం

కేంద్ర బడ్జెట్‌ నిరుత్సాహపరిచింది. 2024-25 ఆర్థిక సంవత్స రానికి గానూ 47.66 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఎటువంటి శషబిషలకు తావు లేకుండానే దేశంలోని కార్పొరేట్లకు మేలు చేస్తూ బడ్జెట్‌ను వండివార్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ పేదలు, మధ్య తరగతి, రైతుల గురించి ఆలోచిస్తుందని ఆశించిన వారికి తీవ్ర నిరాశను కలిగించింది. సుమారు రెండు కోట్ల ప్రభుత్వ, మరో రెండు కోట్ల ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది. వేతన జీవుల వేతన శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయకుండా నిరుత్సాహపరిచింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మహిళలకు మేలు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. దేశంలోని 83 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని తొమ్మిది కోట్ల మంది సభ్యులకు, ఆయుష్మాన్‌ భారత్‌లో ఆశాలు, అంగన్వాడీలకు స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోడీ, 2024 నడుస్తున్నప్పటికీ రైతుల ఆదా యాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ నీరోడుతోంది. ఇది చాలదన్నట్లు రైతుల ఆదాయాన్ని అధికం చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా మారిందనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన హామీలైన కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న హామీని నిర్లక్ష్యం చేసింది. ప్రతి ఏటా రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు, మేథావులు అడిగినప్పుడు పదేళ్లలో అమలు చేయాల్సిన నిర్ణయాలని, ఇంకా సమయం ఉందని దాటవేయడం తెలిసిందే. రాష్ట్రం విడిపోయి నేటితో పదేళ్లు నిండిన నేపథ్యంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులను విడుదలను నిలిపేసింది. కడప-బెంగళూరు రైల్వేలైన్‌ ఏర్పాటు కలగా మారింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ కేంద్ర, రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతంలో రాష్ట్రంలోని వైఎస్‌ జగన్‌ సర్కారు ఆయన ఆశయాన్ని అడియాశలు చేసేదిశగా పయనిస్తోంది. కడప నుంచి బెంగళూరుకు రైల్వేలైన్‌ ఏర్పడితే సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగుల దగ్గర నుంచి రైతుల ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా చేయడం సులభంగా మారనుంది. ఫలితంగా వెనుకబడిన ప్రాం తంలోని కడప జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి సరుకుల రవాణా దగ్గర నుంచి మానవ వనరుల రాకపోకలు పెరగడం ద్వారా పేదలకు మేలు కలిగే అవకాశం ఉండేది. ఇటువంటి ప్రజల సౌకర్యాలను కాదని, ముద్దనూరు మీదుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మీదుగా రైల్వేలైన్‌ ఏర్పాటుకు మొగ్గు చూపించడం విస్మయాన్ని కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం ఆందోళనకరం. ఇది చాలద న్నట్లు కేంద్రం మొండి చేయి చూపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేప థ్యంలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన కడప, రాజంపేట ఎంపీలు సైతం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. దీంతోపాటు ఓబులారిపల్లి-కృష్ణపట్నం రైల్వేలైన్‌ను సరుకుల రవాణాకు పరిమితం చేయడంపై ఎటువంటి స్పందన లేకపోవడం, జిల్లా నుంచి ప్రొద్దు టూరు-కంభం సహా పలు రైల్వేలైన్లకు కేటాయింపులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏదేమైనా జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యవహరించలేని ఎంపీల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. – ప్రజాశక్తి- కడప ప్రతినిధి

➡️