నిర్లక్ష్యంగా ఉండే బిఎల్‌ఒలపై చర్యలు తప్పవు

Feb 2,2024 23:06

మాట్లాడుతున్న కమిషనర్‌ కీర్తి చేకూరి
ప్రజాశక్తి-గుంటూరు :
ఓటర్ల డ్రాఫ్ట్‌రోల్‌ అనంతరం చేపట్టిన ఓటర్ల వెరిఫికేషన్‌, జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యంగా ఉన్న బూత్‌లెవల్‌ అధికారులు (బిఎల్‌ఒ), ఎన్నికల సూపర్వైజరీ అధికారులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ ఇఆర్‌ఒ కీర్తి చేకూరి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో పశ్చిమ నియోజకవర్గ బిఎల్‌ఓలు, సూపర్వైజరీ అధికారులతో ఓటర్ల తుది జాబితాపై సమీక్షించారు.ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో నిర్లిప్తత, నిర్లక్ష్యం సహించబోమన్నారు. ఓటర్ల డ్రాఫ్ట్‌ రోల్‌లో వచ్చిన తప్పులు తుది జాబితాలో కూడా వచ్చి ఉంటే సంబంధిత బిఎల్‌ఓలపై చర్యలు తీసుకోవాలని ఏఈఆర్‌ఓలను ఆదేశించారు. తుది జాబితాపై బిఎల్‌ఓల వారీగా సూపర్వైజరీ అధికారులు రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని, సూపర్వైజరీ అధికారుల పనిపై ఏఈఆర్‌ఓలు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డూప్లికేట్‌, ఫొటోలు తప్పుగా ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్కో బిఎల్‌ఓకి షుమారు వెయ్యి ఓట్లు ఉండగా, డ్రాఫ్ట్‌ రోల్‌ వచ్చిన నాటి నుండి 6 నెలలు సమయం ఉన్నప్పటికీ తుది జాబితాలో తప్పులు వచ్చేలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం అంటే వారిని ఉపేక్షించకూడదని అన్నారు. బిఎల్‌ఓలకు కేటాయించిన ఓటర్ల వివరాలు తుది జాబితాలో సక్రమంగా వచ్చే వరకు తనదే బాధ్యతని, అనధికారికంగా సెలవులు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని సంబందిత బిఎల్‌ఓతో కలిసి సూపర్వైజరీ అధికారులు పరిశీలించి, వృద్ధులకు, వికలాంగులకు సౌకర్యం కోసం ర్యాంప్‌లు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్‌ఓ, అదనపు కమిషనర్‌ కె.లక్ష్మీశివజ్యోతి, ఏఆర్‌ఓ ఇందిరాదేవి, ఏఈఆర్‌ఓలు సిహెచ్‌.శ్రీనివాస్‌, టి.వెంకట కృష్ణయ్య, ప్రదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️