నిలిచి పోయిన ట్రాఫిక్‌ చలాన్స్

నిలిచి పోయిన ట్రాఫిక్‌ చలాన్స్

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిట్రాఫిక్‌ ఈ చలాన్‌ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త యాప్‌ ఎప్పుడొస్తుదో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటి వరకూ ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు కళ్లెం వేసెదెలా అనే ప్రశ్న పోలీసు శాఖలోని ట్రాఫిక్‌ విభాగంలో తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పాత యాప్‌ రద్దు చేసి నాలుగు నెలలు దాటింది. ట్రాఫిక్‌ ఈ చలానాలు వేసే యాప్‌ దుర్వినియోగం కావడం.. రూ.కోట్ల కుంభకోణం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్‌ను ఆపేసింది. ప్రత్యామ్నాయం చూడకుండా యాప్‌ నిలిపేయడంతో ఈ చలానాల ద్వారా పోలీసు శాఖకు రావాల్సిన రూ.లక్షలాది ఆదాయానికి గండిపడింది. మరోవైపు ట్రాఫిక్‌ ఉల్లంఘనులు యథేచ్ఛగా వాహనాలను వినియోగించడటంతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ ఇబ్బందులు పరిపాటిగా మారాయి. జిల్లా కేంద్రమైన రాజమ హేంద్రవరం, పలు పట్టణ కేంద్రాల్లో ఈ ఏడాది అగస్టు వరకూ ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ పోలీసులు ప్రధాన వీధుల్లో ఉల్లంఘనులను గుర్తించి కేసులు రాస్తుండేవారు. ప్రస్తుతం యాప్‌ అందుబాటులో లేకపోవటంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి ఫొటోలను తీసి భద్రపరుస్తున్నారు. కొత్త యాప్‌ అందుబాటులోకి రాగానే అప్‌లోడ్‌ చేసి చలాన్లు విధించే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వాహన చోదకులకు విధించే అపరాధ రుసుం ద్వారా ఏడాదికి రూ.1.20 కోట్ల మేర ఆదాయం పోలీసుశాఖకు వస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి అగస్టు-31 వరకు 58,962 కేసులు నమోదు కాగా రూ.92.01 లక్షలు అపరాధ రుసుము వసూలు చేశారు. సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ఈ చలానా కింద గడిచిన నాలుగు నెలల్లో దాదాపు రూ.50 లక్షల మేర ఆదాయం పోలీసు శాఖ కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం వాణిజ్యం కేంద్రం కావడంతో రోజు రోజుకీ పట్టణ జనాభా పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వివిధ వస్తువులు కొనుగోలు, విధుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. ప్రస్తుత అవసరాల రీత్యా వాహన వినియోగం పరిపాటిగా మారింది. కావున ద్విచక్ర వాహనాలు, కార్లు సంఖ్య గణనీయంగా పెరిగింది. మరోవైపు రహదారులు విస్తరించకుండా డివైడర్లు ఏర్పాటు చేయడం, కొన్నిసార్లు మైనర్లు సైతం వాహనాలను వినియోగించడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. బస్‌ కాంప్లెక్స్‌, దానవాయిపేట, రైల్వే స్టేషన్‌ ఏరియా, దేవీచౌక్‌ తదితర ముఖ్య ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు, వాహన చోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️