నీటి బిలుల్ల కోసం వైసీపీ నాయకుల ధర్నా

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: గ్రామాల్లో నీటి అవసరాలు తీర్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటి బిల్లుల బకాయిలు రూ.29 కోట్లను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నాయకులు, సర్పంచ్‌లు యర్రగొండపాలెంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం, పుల్లలచెరువు వైసీపీ మండల కన్వీనర్లు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, బివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2019 నుంచి ఇప్పటివరకు నీళ్లు తోలితే ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. నీళ్లు తోలేందుకు ట్యాంకర్లకు డీజిల్‌, డ్రైవర్లకు ఇలా సొంత డబ్బులు పెట్టి అప్పులపాలయ్యారని చెప్పారు. అప్పులు తెచ్చిన చోట నీలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేత చెప్పిన మాట నమ్మి అప్పులపాలు కావాల్సి వచ్చిందని అన్నారు. వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. గతంలో ఆందోళన చేసినప్పుడు బిల్లులన్నీ పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన పాలకులు, అధికారులు మాట తప్పారని మండిపడుతున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తే ఉద్యమించాల్సి వస్తుందని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ శ్రీకాంత్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు జడ్పిటిసి వాగ్యానాయక్‌, మల్లాపాలెం మాజీ సర్పంచ్‌ రమణారెడ్డి, ఎన్‌వి నారాయణరెడ్డి, రాజులయ్య, కాశిరెడ్డి, నాగేశ్వరరావు నాయక్‌, వెంకటరామిరెడ్డి, అంజిరెడ్డి, గంజివారిపల్లి సర్పంచ్‌ దుగ్గెంపూడి సుబ్బారెడ్డితో పాటు ట్యాంకర్ల యజమానులు పాల్గొన్నారు.

➡️