నీట మునిగిన పంటలు

నీట మునిగిన వరి పనలను ఒడ్డుకు తీస్తున్న వృద్ధ రైతు

తడిసి ముద్దయిన వరి పనులు

 గాలులకు నేలకొరిగిన వైనం

 మొలకలెత్తుతాయని ఆందోళనలో రైతులు

 ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపు

ప్రజాశక్తి -అనకాపల్లి

తుఫాను వల్ల మండలంలో సోమవారం 10 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, మంగళవారం నాటికి 77 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి ఈదురుగాలు తోడు కావడంతో వరి పంట మొత్తం నేలమట్టమైంది. ఇప్పటికే వరి పంట కోసి మడులపై ఆరబెట్టిన పనలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మండలంలోని అనకాపల్లి ఆవకండం, బగులవాడ, మార్టూరు, దిబ్బపాలెం, సీతానగరం, తగరంపూడి, కూండ్రం, కుంచంగి, తుమ్మపాల, శంకరం, రేబాక, వెంకుపాలెం, చింత నిప్పుల అగ్రహారం తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి చేను పూర్తిగా నీట మునిగింది. ఇదే తరహాలో మరో రోజు వర్షం కురిస్తే తమ పంటలు పూర్తిగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని, నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు.బుచ్చయ్యపేట : మండలంలో ఎడతెరిపి లేకుండా మంగళవారం ఉదయం నుండి భారీ వర్షం కురిసింది. దీంతో వడ్డాది, చిన్నప్పన్నపాలెం, పోలేపల్లి, మంగళాపురం విజయరామరాజుపేట, బంగారుమెట్ట తదితరు గ్రామాల్లో వరి, చెరకు, అరటి తదితర పంటలు నీటి మునిగాయి. చిన్నప్పన్నపాలెం, వడ్డాది తదితర గ్రామాల్లో 100 ఎకరాలకు పైగా కోసిన వరి పంట పొలాల్లోనే ఉండిపోయింది. దొండా నారాయణమూర్తికి చెందిన వరి పంట 8 ఎకరాలు, దండ కన్నయ్య దొర మూడు ఎకరాలు, కొల్లివలస అప్పారావు రెండెకరాలు, బత్తుల ఈశ్వరరావు రెండెకరాలు, సకల ఈశ్వరరావు రెండెకరాలు, సకల లావరాజు, తాతబాబు, రాజబాబు నాలుగెకరాల్లో కోసిన పంట నీటమునిగింది. కె.కోటపాడు : మండలంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. తెల్లవారుజామున నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురవడంతో పొలాల్లోని వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల హెచ్చరికలతో ఎక్కడకక్కడ మడులోనే చిన్నచిన్న కుప్పలుగా పెట్టగా, భారీ వర్షం కారణంగా మడుల్లో నీరు చేరడంతో పెట్టిన కుప్పలు కూడా నీట మునిగాయి. ఇంక కోత కోయ్య కుండా ఉన్న వరి పంట ఈదురు గాలుల వలన పూర్తిగా నేలమట్టమైంది. వరి కంకులు నీటిలో మునిగిపోవడంతో మొలకెత్తే ప్రమాదం ఉందని రైతుల ఆందోళన చెందుతున్నారు. అనేక ఇబ్బందులు పడి అప్పులు చేసి పంటను పండించగా చేతికి వచ్చే సమయంలో తుఫాన్‌ రైతును నీట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పాడైన పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.కశింకోట : వర్షానికి మండలంలో వరి, చెరుకు పంటలు దెబ్బతిన్నాయి. గాలులకు వరి, చెరుకు పంటలు నెలకొరిగాయి. చెరుకు క్రషర్‌ వద్ద నిల్వ వున్న చెరుకు రసము రాదుని, ఆడిన్‌ చేరుకు రసం పులుసు పోయ బెల్లం రాదని రైతులు ఆందోళన చెందతున్నారు.అచ్యుతాపురం : మండలంలో పల్లపు ప్రాంతాలైన జగ్గన్నపేట, కాజీపాలెం, పెదపాడు, తిమ్మరాజుపేట, హరిపాలెం, ఎర్రవరం, అందాలపల్లి, కొండకర్ల గ్రామాలలో వరి పంట వర్షానికి నేలకొరిగింది. రైతన్నలు పంటను చూసి దిగులు చెందుతున్నారు. ఇప్పటికైనా వర్షం ఆగితే తడిసిన పంటను దక్కించుకోవడానికి అవకాశం ఉంటుందన్న రైతులు అంటున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పశుగ్రాసం సమస్య ఏర్పడిందని పాడి రైతులు తెలిపారు.దేవరాపల్లి : తుఫాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. చాలా వరకు కోసిన వరి పంట మడిల్లో కుప్పలుగా పెట్టినా, భారీ వర్షం కారణంగా మడుల్లో నీరు చేరింది. కోటవురట్ల : తుఫాన్‌ ప్రభావంతో మండలవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిశాయి, దీంతో ఆరుగాలం పండించిన పంట నేలమట్టమైంది. పలు గ్రామాల్లోని వరి పంట కోత దశకు చేరుకున్న వరి పంట నేలకొరిగింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి మండల పరిషత్‌ కార్యాలయంలోకి వర్షపు నీరు చొరబడింది. మండలంలో సోమవారం 30 మిల్లీమీటర్లు, మంగళవారం 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసి కురియడంతో జనజీవనం స్తంభించింది, జల్లూరు వంతెనపై ప్రయాణానికి జనం భయపడ్డారు. వంతెన పై గోతుల్లో నీరు నిల్వ ఉండడంతో వాహనాలు అదుపుతప్పే పరిస్థితి ఉంది.నక్కపల్లి : మిచౌంగ్‌ తుపాన్‌ అన్నదాతకు తీవ్ర నష్టం మిగిల్చింది. తుపాన్‌ ప్రభావంతో మంగళవారం మండలంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. సుమారుగా 300 నుండి 400 ఎకరాల్లో కోత దశకు చేరుకున్న వరి నేలకొరిగింది. సుమారుగా 50 ఎకరాల్లో కోత కోసిన వరి పనల మీద తడిసి ముద్దయింది. కోత దశలో ఉన్న వరి వర్షార్పణం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసిన పెట్టుబడులు పెట్టిన రైతులు అప్పులు ఊబిలో మునిగారు.మాకవరపాలెం : వీడకుండా కురిసిన వర్షాలతో అరుగాలం శ్రమించి, చేతికి అందొచ్చే దశలో వరిపైర్లు నీటమునగడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీప్‌లో ఆదిలో వర్షాభావం వల్ల సాగునీటికి ఇబ్బందులుప డుతూ, భారీగాపెట్టుబడులు పెట్టి అష్టకష్టాల కోర్చి పండించిన పంటలు, ఇలా చివర దశలు గంగపాలు కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గొలుగొండ : కోతల కోసి కళ్లానికి చేర్చేలోపే తుఫాను ముంచుకు రావడంతో వరిపైర్లు తడసి పాడయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అమ్మపేట గ్రామంలో సుమారు 5 ఎకరాలు పంట నీట మునిగిపోయిందని బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. మండలం మొత్తం మీద 50 ఎకరాల్లో వరి పంట నీట మునిగగా, 50 ఎకరాల్లో పంట చేను నేలమట్టం అయిందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఆనందపురం : మిచౌంగ్‌ తుపానుతో చేతికి అందివచ్చే దశలో ఉన్న వరిపైర్లుకు తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. వీడకుండా కరుస్తున్న వర్షానికి, ఈదురు గాలులకు పొలాల్లో తడిసిన వచి పంట బరువెక్కి నేలవాలిపోయిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బోని, గొట్టిపల్లి, కుశలవాడ, ముచ్చర్ల, సీర్లపాలెం, ముకుందపురం, పొడుగుపాలెం, ఆనందపురం, చందక, బీపీ కల్లాలు, పెద్దిపాలెం తదితర గ్రామాల్లో కోత దశలో ఉన్న వరి చేను నేలకొరిగి నీటిలో మునిగింది. బోని గ్రామంలో కల్లాలలో, పొలాల్లో ఉన్న ధాన్యాన్ని తార్నాలతో కప్పడంతో తార్పానులపై నీరు చేరింది. వర్షాభావ పరిస్థితుల్లో అతికష్టం మీద పండించిన వరిపంట ఇప్పుడు మిచౌంగ్‌ తుపాను దెబ్బకు గంగపాలు కానున్నదని రైతులు బోరున విలపిస్తున్నారు.

➡️