నీ భవిష్యత్తు బాధ్యత నాది

Apr 2,2024 22:09

ప్రజాశక్తి-చీపురుపల్లి  : చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సీటును విజయనగరం పార్లమెంట్‌ టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జునకు కేటాయించక పోవడంతో తీవ్ర అసంతప్తికి గురైన ఆయన పార్టీపట్ల ధిక్కార స్వరం వినిపించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విజయవాడ రావాలని లోకేష్‌ నుంచి పిలుపు రావడంతో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక, చీపురుపల్లిలో ఓటమి పాలయ్యాక వైసిపి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యలపై జిల్లాలో మొట్టమొదట రోడ్డెక్కింది నాగార్జునేని, ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారని నాలుగు మండలాలు నాయకులు లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా లోకేష్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ అధ్యక్ష పదవి రాజీనామా వెనక్కి తీసుకొని జిల్లాలో ఎన్నికలు ప్రచారంలో పాల్గొనాలని కోరారు. నియోజక వర్గంలో 5సంవత్సరాల నుండి అతి చిన్న వయసులో పార్టీ కోసం బాగా పని చేశావని అన్నారు. నాగార్జున రాజకీయ భవిష్యత్తు చూసుకొనే బాధ్యత తనదని చెప్పారు. జిల్లాలో ఎన్నికల ప్రచారం బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాలుగు మండలాలు నాయకులు రౌతు కామునాయుడు, పైల బలరాం, వెన్నె సన్యాసి నాయుడు, దన్నాన రామ చంద్రుడు, తాడ్డే సన్యాసి నాయుడు, సారేపాక సురేష్‌ బాబు, చనమాల మహేశ్వర రావు,ముల్లు రమణ,పిళ్ళా అప్పలనాయుడు, మహంతి రమణ మూర్తి, మహంతి అప్పలనాయుడు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, మాజీలు పాల్గొన్నారు.

➡️