నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 29,2024 21:35

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : ఇంటర్‌ పరీక్షలు మార్చి 1 తేదీ శుక్రవారం నుంచి జరుగనున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 తేదీ నుంచి జరిగిన ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తయ్యాయి. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకొనేలా ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్‌ అంతరాయం లేకుండా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌ 11456మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5756 మంది పరీక్ష రాయనుండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5700 మంది హాజరు కానున్నారు. వీరితో పాటు సప్లిమెంటరీ విభాగానికి చెందిన విద్యార్థులు 1744మంది పరీక్షలు రాయనున్నారు. అలాగే ఫస్ట్‌ ఇయిర్‌ ఒకేషనల్‌ 3674 మంది, సెకెండర్‌ ఇయర్‌ 3396మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, అవకతవకలు జరగకుండా నిఘా కెమెరాలు పెట్టారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్దులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి, 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదు.సెల్‌ ఫోన్లు అనుమతి లేదు పరీక్షలు రాసే అభ్యర్థులు, పరీక్షలు నిర్వహించే సిబ్బంది, ఇన్విజిలేటర్‌లు ఎవరూ పరీక్ష కేంద్రాలకు సెల్‌ ఫోన్లు తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదు. కాలేజీలో పని చేసే సిబ్బంది కూడా సెల్‌ ఫోన్లు వినియోగించడానికి అనుమతి లేదు. అన్ని పరీక్ష కేంద్రాలు వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. రెండు ఫ్లయింగ్‌ స్క్వేడ్లు, రెండు సిట్టింగ్‌ స్వేడ్ల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి.

➡️