నేటి నుండి మూడ్రోజులపాటు సాగరమాత ఉత్సవాలు

Mar 6,2024 19:41

సాగర మాత ఆలయం
ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ :
సాగర్‌లోని కృష్ణా నది తీరానున్న మేరీ మాత (సాగర్‌ మాత) ఆలయ ఉత్సవాలకు ఏర్పాటు పూర్తయ్యాయి. గురువారం నుండి మూడ్రోజులపాటు ఉత్సవాలకు అన్ని మతాల వారూ వస్తుంటారు. దేశంలోనే భారతీయ సంప్రదాయ రీతులతో నిర్మించిన తొలి క్రైస్తవమందిరంగా ఈ ఆలయానికి పేరుంది. ధూప, దీప, నైవేధ్యాలు, కొబ్బరికాయలు కొట్టడం, అగర్‌ బత్తీలు వెలిగించడం, హారతి, తలనీలాలు సమర్పించటం తదితర కార్యక్రమాలన్నీ హిందు పద్ధతిలో జరిగే క్రైస్తవ ఆలయమిది. మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో విచారణ గురువుగా పనిచేసిన మొదటి సైమన్‌ స్వామి ఈ దేవాలయం నిర్మాణానికి నడుంకట్టగా గుంటురు క్రైస్తవ పీఠాధిపతి బాలసౌరి అన్ని విధాలా సహకరించారు. 1976 ఫిబ్రవరి 10న శంకుస్థాపన అనంతరం సంభవించిన వరదలు, కరువు కాటకాల వల్ల మందిర నిర్మాణం ఆగింది. తరువాత సైమన్‌ స్వామి రెంటచింతల అడవి సంపద నుంచి ధన సహాయం పొంది నిర్మాణం పూర్తి చేశారు. అనంతరం అనేక నిర్మాణాలనూ క్రైస్తవ పద్ధతుల్లో పూర్తి చేశారు. ఉత్సవాల ప్రారంభం రోజైన గురువారం ఉదయం 5.30 గంటలకు దివ్య బలి పూజతో ఉత్సవాలు మొదలవుతాయి. అనేక సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి సుమారు 2 లక్షల మంది వస్తారని అంచనా. ఇందుకు తగ్గట్లు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో ఆలంకరించారు. సందర్శకులకు అసౌకర్యం తలెత్తకుండా తాగునీరు, మెడికల్‌ సదుపాయం, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేశామని సాగరమాత విచారణ గురువు జోసెఫ్‌ బాల సాగర్‌ చెప్పారు.

➡️