నేడు కలెక్టరేట్‌ ఎదుట విఆర్‌ఎల ధర్నా

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) తమ సమస్యల పరిష్కారం కోరుతూ విఆర్‌ఎలు గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (విఆర్‌ఎ) ప్రొద్దుటూరు అధ్యక్షుడు ఆర్‌.చిన్న మునెయ్య పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన బుధవారం తహశీల్దార్‌ నజీర్‌ అహ్మద్‌కు అనుమతి కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్నమునయ్య మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు రెవెన్యూ శాఖలో దిగువ స్థాయిలో పనిచేస్తూ ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. శాఖ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. గ్రామంలో నివసిస్తూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కరించడం, వారికి అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. పేరుకు మాత్రం పార్ట్‌ టైం ఉద్యోగులం అన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కె.దానం, బి.చంద్రహాస్‌ పాల్గొన్నారు.

➡️