నేడు పూలే సర్కిల్‌లో ఆందోళన : సిపిఎం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ జిల్లాలో కొన్ని రోజులుగా వివిధ రంగాల కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈనెల 2న పాత బస్టాండ్‌లో ఉన్న పూలే సర్కిల్‌లో ఆందోళన నిర్వహించనున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్‌, కమిటీ సభ్యులు జమీలా, మహబూబ్‌ తార, శంషాద్‌ తెలిపారు. సోమవారం సిపిఎం కార్యాలయంలో పార్టీ నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్‌ , తదితర రంగాల ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కషి చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కారం చేసి పోరాటాలను విరమింప జేయకుండా నిర్భందం, బెదిరింపుల ద్వారా, కార్మికుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ పద్ధతుల ద్వారా కార్మికుల పోరాటాలను నిర్వీర్యం చేయడం సాధ్యం కాదని తెలిపారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరలేదని, పరిష్కారానికి అవకాశం వున్న సమస్యలు మాత్రమే అన్నారు. జిల్లాలో కార్మికుల ఐక్యతను చీల్చే ప్రయత్నం అధికార పార్టీ నేతలు తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్మికవర్గ పోరాటాలకు సంఘీభావంగా ఆందోళనను జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

➡️