రాష్ట్ర, స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే కు కౌలు రైతుల వినతి

ప్రజాశక్తి – తాళ్లరేవు (కాకినాడ) : రాష్ట్ర వ్యాప్త కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ … ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కు రాష్ట్ర వ్యాప్త కౌలు రైతుల సమస్యలపై వినతి పత్రం, తాళ్ళరేవు మండలం సమస్యలపై మరో వినతి పత్రం అందించారు. మొదటి వినతిపత్రంలో భాగంగా భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. గత 2011 భూ అధీకఅత చట్టాన్ని అమలు చేయాలన్నారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ద్వారా కౌలు రైతులను గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఈ క్రాప్‌ లో ప్రతి కౌలు రైతును చేర్చి పంట రుణం, పంట నష్టం పంటల భీమా, రైతు భరోసా వంటి రాయితీలు కౌలు రైతులకు ఇవ్వాలని అన్నారు. కులంతో సంబంధం లేకుండా భూమి విస్తీర్ణం ఎంత చేస్తున్నప్పటికీ అన్ని కులాల కౌలు రైతులకు రైతు భరోసా వర్తింప చేయాలని కోరారు. అదేవిధంగా తాళ్ళరేవు మండలంలో సైఫాన్‌ కింద ఉన్న 6 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని, పంట కాలవలు మురుగు కాలవలు బాగు చేయాలని, ఇంజరం వంతెన వెంటనే నిర్మించి ప్రత్యామ్నాయ కరకట్ట తొలగించాలని అన్నారు. సైపాన్‌ కాలవపై పంట నీరు రావడానికి సిమెంటు తొట్టి నిర్మించాలనీ, దాల్వాలో అమ్మిన ధాన్యానికి బకాయి బిల్లులు చెల్లించాలని కోరారు. ఈ సమస్యలపై ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్లు రాజబాబు రాష్ట్రస్థాయి, స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే సుబ్బరాజుకు 20 నిమిషాలపాటు వివరించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్పందిస్తూ … కౌలు రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని, స్థానిక సమస్యలపై అధికారులతో, ప్రభుత్వంతో మాట్లాడి పంట పొలాలు పూర్తిగా పండే విధంగా తక్షణ చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్లు రాజబాబు, భజన సత్తిబాబు, పి. మల్లవరం, జార్జి పేట రైతులు పిల్లి సత్యనారాయణ, దడాల వెంకటేశ్వరరావు, సూరంపూడి సూరిబాబు , పేరాబత్తుల సాయి నరేంద్ర, కాదా రామకృష్ణ, అనుసూరి సత్యనారాయణ, రాయుడు వీర్రాజు, పంపన శ్రీను, పేరా బత్తుల భైరవమూర్తి, ఎం. అర్జున రావు, మేడిశెట్టి రమణ, కడలి శ్రీను, మేడిశెట్టి భైరవమూర్తి పాల్గొన్నారు.

➡️