నేడే సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం

సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం

విజయవంతంగా ట్రయల్‌ రన్‌

ప్రజాశక్తి- సింహాచలం : సింహాద్రి అప్పన్న తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 9న, శుక్రవారం సాయంకాలం కొండదిగువ వరహా పుష్కరిలో 5:30గంటలకు స్వామి హంస వాహనంపై పుష్కరిణి చెరువులో విహరించేందుక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంకాలం ఎసిపి అన్నెపు నరసింహమూర్తి, గోపాలపట్నం సిఐ సురేష్‌ తదితరులతో కలిసి, ఆలయ ఇఒ ఎస్‌ శ్రీనివాసమూర్తి, దేవస్థానం ఇఇ శ్రీనివాసరాజు, రాంబాబు ఆధ్వర్యంలో ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు. స్వామి విహరించే పడవను సర్వాంగసుందరంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. భారీగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇఒ తెలిపారు. వేడుకలో భాగంగా శుక్రవారంఉదయం దేవాలయ అర్చక బృందం సంప్రోక్షణ చేస్తారు. సాయంత్రం 4గంటలకు వేణుగోపాలుడు అలంకరణలో స్వామి మెట్ల మార్గంలో కొండదిగువ తొలి పావంచా చేరుకుంటారు. అక్కడినుంచి పుష్కరిణికి చేరుకొని, ప్రత్యేక వేదికపై ఐదున్నర గంటలకు భక్తులకు దర్శనమిస్తారు అనంతరం హంసవాహనంపై జల విహారం చేస్తారు రాత్రి 7:15 గంటల వరకు పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో పూజలు నిర్వహిస్తారు. తర్వాత పుష్కరిణి సత్రము వద్దకు చేరుకొని, 8:15గంటల నుంచి సర్వజన మనోరంజని వాహనంపై మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తర్వాత పైడితల్లమ్మ గుడి వరకు వెళ్లి, మెట్లు మార్గంలో కొండపైకి చేరుకుంటారు. ఈ సందర్భంగా కొండపై స్వామి దర్శనాలు శుక్రవారం సాయంత్రం 6గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామి ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన సేవా టికెట్లు రద్దుచేశారు.

➡️