నేలకొరిగిన ఉద్యమాల వృక్షం

ఉద్యమాల వృక్షం

మదనపడుతున్న మన్యవాసులు, ప్రకృతి ప్రేమికులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి: దశాబ్దాల చరిత్ర కలిగి, ఉద్యమాలకు కేంద్రబింధువుగా ఉన్న ఉద్యమాల భారీ మామిడి వక్షం జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నేలకొరిగింది. ఆర్‌అండ్‌బి అతిథి గృహం ఎదురుగా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ భారీ మామిడి చెట్టు, వేసవిలో ఎంతోమంది బాటసారులకు, వాహన చోదకులకు, చిరు వ్యాపారులకు, ఎన్నో పశుపక్ష్యాదులకు సేదదీరేందుకు నీడ నిచ్చేది.మన్యంలో ఉద్యోగ,ఉపాధ్యాయలు, కార్మిక, కర్షకులు, పార్టీలకు అతీతంగా ఎవరైనా, ఎటువంటి ఉద్యమం, పోరాటాన్ని మొదలుపెట్టాలంటే సెంటిమెంట్‌గా ఈ చెట్టునుంచే ప్రారంభించేవారు. సిపిఎం, సిఐటియు, ఆదివాసీ గిరిజనసంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రతి పోరాటాన్ని ఈ మహావృక్షం నుండే మొదలుపెట్టేవారు. చివరగా ఇటీవల విజయవంతమైన అంగన్వాడీల 42 రోజుల సమ్మె పోరాటాన్ని కూడా ఇదే చెట్టు కింద నిర్వహించారు. ఆశా వర్కర్ల నిరసన చివరగా ఇక్కడే జరిగింది.నీడనివ్వడంతోపాటు పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ భారీవృక్షాన్ని నేలకూల్చడంతో ఆప్రాంతమంతా బోసిపోయింది. ఇంతటి చారిత్రక నేపథ్యం, సెంటిమెంట్‌ ఉన్న ఏళ్లనాటి వృక్షాలతోపాటు ఏజెన్సీ పొడుగునా రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను తొలగిస్తుండడంతో ఏదో కోల్పోతున్నామనే భావనతో మన్యవాసులు మదన పడుతున్నారు. రోడ్లు విస్తరణ అవసరమే అయినా, దాని వల్ల మన్యంలో రోడ్లు వెంబడి పచ్చదనంతోపాటు నీడనిచ్చే వృక్షాలు కనుమరుగవుతుండడంతో ఏజెన్సీ ప్రాంత వాసులతోపాటు ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

నేలకొరిగిన ఉద్యమాల నిలయమైన భారీ వృక్షం

➡️