పంట నష్టపరిహారం ఇవ్వాలి

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : మిచౌంగ్‌ తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఇప్పటి వరకు రైతులు దగ్గర ఉన్న పంటలకు మద్దతు ధరకు కొనాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం నరసరావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో వారు మాట్లాడుతూ పల్నాడులో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 50 శాతం మాత్రమే సాగైనదని, నీటి ఎద్దడి వల్ల చాలా వరకు పైరు దెబ్బతిందని, రబీలో సాగు చేసిన పంటలను తుపాను నష్టపరిచిందని చెప్పారు. ప్రకృతి విపత్తుల కింద తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ఈ మేరకు తక్షణమే ప్రకటన విడుదల చేసి రైతుల్లో భరోసా కల్పించాలని కోరారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఆహార సంక్షోభం రాకముందే వ్యవసాయ రంగానికి, రైతులకు రాయితీలు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని సూచించారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఇప్పటికైనా తమ విధానాలను మార్చుకుని ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను అందించాలని, రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

➡️