పండుగనాడు కూడా కొనసాగిన అంగన్వాడీల సమ్మె

Jan 15,2024 17:56 #Anganwadi strike

ప్రజాశక్తి-హిందూపురం(అనంతపురం) :తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి నాడు కూడా అంగన్వాడీ కార్మికులు సమ్మె నిర్వహించారు. 35 వ రోజు సోమవారం సైతం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సద్భవన్ సర్కిల్ లో నడి రోడ్ పై కట్టెల పొయ్యి వెలిగించి దానిపై సంక్రాంతి పొంగలి తయారు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనసు మారి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చి, సమ్మె పరిష్కారం చేసి అందరికీ మంచి చేయాలని వారు కోరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి లావణ్య మాట్లాడుతు క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సరము, సంక్రాంతి అన్ని పండుగలు కూడా రోడ్లపైనే అంగన్వాడీలో చేసుకోవాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వంలోను రాలేదని జగనన్న ప్రభుత్వంలో వచ్చిందన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐదుసార్లు అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులను చర్చలకు ఆహ్వానించినప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రతినిధులు సుముఖతను తెలియజేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు నెరవేర్చాలన్నారు. లేదంటే మా ఉద్యమం మరింత ఉద్రితం అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు శిరీష, శైలజ, వరలక్ష్మి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️