పండుగ రోజూ సమ్మెలోనే..

ప్రజాశక్తి – యంత్రాంగం

జిల్లాలో అంగన్‌వాడీల సమ్మె 14వ రోజు క్రిస్మస్‌ సందర్భంగా సమ్మె శిబిరాల వద్ద సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేసి నిరసన తెలిపారు. ‘ఓ ప్రభువా మా సిఎంకు మంచి బుద్ధిని ప్రసాదించు.. మా సమస్యలు పరిష్కరించేలా చూడు’ అంటూ వినూత్నంగా ప్రార్థనలతో హోరెత్తించారు. పలుచోట్ల ఒంటికాలిపై, చెవిలో పూలతో నిరసన తెలిపారు. అలాగే జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు క్రిస్మస్‌ రోజు కూడా సమ్మెను యథావిధిగా కొనసాగించారు. ప్రభుత్వం దిగొచ్చేవరకూ సమ్మెను ఆపేదిలేదంటూ వారంతా స్పష్టం చేశారు. ఏలూరు : అంగన్వాడీల 14వ రోజు సమ్మెలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ వద్ద క్రిస్మస్‌ సందర్భంగా రోడ్డు మీద కేక్‌ కట్‌చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలు నాలుగున్నరేళ్లుగా అనేకసార్లు సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు కోరినా జగన్‌ ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సమ్మె చేపట్టారన్నారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు పనులకు వెళితే వారి పిల్లల్ని తల్లి మాదిరి అంగన్వాడీలు చూసుకుంటున్నారని గుర్తు చేశారు. అలాంటి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు. పండగపూట సంతోషంగా కుటుంబాలతో గడపాల్సిన రోజు రోడ్డుమీద పండగ చేసుకోవడం బాధాకరమన్నారు. జిల్లాలో అనేకచోట్ల అంగన్వాడీలను భయపెట్టేందుకు అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల ముందు జగన్‌ ప్రభుత్వం అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని హామీ ఇచ్చారని, ఐదేళ్లు గడుస్తున్నా హామీ అమలు చేయలేదని విమర్శించారు. పైగా ఎఫ్‌అర్‌ఎస్‌ యాప్‌ల పేరుతో పనిభారం పెంచారన్నారు. అంగన్వాడీ సెంటర్‌ అద్దెలు, గాస్‌ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదన్నారు. నెలల తరబడి బకాయిలుంటే అంగన్వాడీ కార్యకర్తలు వచ్చే కొద్దిపాటి జీతాలతో సెంటర్లు ఎలా నడుపుతారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే వారికి పెన్షన్‌ సౌకర్యం ఉందని, కానీ జీవితాంతం పనిచేసిన అంగన్వాడీలకు పెన్షన్‌ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు టి.రజని, పి.హైమావతి, మల్లిక, అరుణకుమారి, నవతి, సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాధరావు, కార్యదర్శి వి.సాయిబాబు పాల్గొన్నారు.పెదవేగి : ‘ఓ ప్రభువా.. మా సిఎంకు మంచి బుద్ధిని ప్రసాదించు’ అంటూ అంగన్వాడీలు క్రిస్మస్‌ సందర్భంగా ప్రార్థనలు చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు పి.ప్రసాద్‌, టి.కృష్ణవేణి డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు, గ్రాడ్యుటీ రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పండుగనాడు కూడా కుటుంబాలను వదిలిపెట్టి సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కంటే అంగన్వాడీలకు రూ.వెయ్యి అదనంగా ఇస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రూ.400 కోట్లు అదనంగా కేటాయిస్తే ముఖ్యమంత్రి హామీ అమలు చేయొచ్చని తెలిపారు. బైజుస్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీలకు రూ.వేల కోట్లు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అక్క చెల్లెమ్మల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లబ్ధిదారులకు పంపిణీచేసే ఆహారానికి నాణ్యమైన సరుకులు ఇవ్వాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తామని, ఏడాది కిందట ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ శిబిరానికి వి.బేబీ, రాణి, కె.నిర్మల నాయకత్వం వహించారు.చింతలపూడి : సిఎం జగన్‌ అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్‌.నారాయణ అన్నారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో 14వ రోజూ అంగన్వాడీల సమ్మె కొనసాగింది. క్రిస్మస్‌ సందర్భంగా సమ్మె శిబిరంలో క్రిస్మస్‌ కేకును కట్‌చేసీ అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలంటూ ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులతో అంగన్వాడీలు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సరళ, మాణిక్యం పాల్గొన్నారు.ద్వారకాతిరుమల : అంగన్వాడీల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు,హెల్పర్లు నిరసన తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె ఆపే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తులసి, హైమావతి, నాగలక్ష్మి, అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు.నూజివీడు : అంగన్వాడీల సమ్మె 14వ రోజు యథావిధిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నూజివీడు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.ఆర్‌.హనుమాన్లు, జి.రాజు, అంగన్వాడిల యూనియన్‌ నాయకులు ఆదిలక్ష్మి జాన్సీ, మణి, విజయలక్ష్మి పాల్గొన్నారు.బుట్టయగూడెం : సిఎం జగన్‌ తమ సమస్యలను పరిష్కరించే బుద్ధిని ప్రసాదించాలంటూ క్రిస్మస్‌ సందర్భంగా అంగన్వాడీలు కేక్‌ కట్‌ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు రోడ్లపైనే ప్రార్థన చేసి ప్రభుత్వం తమను రక్షించాలంటూ వేడుకున్నారు. 14 రోజులుగా కేంద్రాలను మూసివేసి సమ్మె చేస్తున్నప్పటికీ అక్క, చెల్లెమ్మలను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రికి మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ వినూత్నంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎం.నాగమణి, పుష్ప, రామలక్ష్మి, కృపామణి, నూర్జహాన్‌, మరమ్మ, ఆకాశమ్మ, మున్నీ పాల్గొన్నారు.వేలేరుపాడు : మండలంలో అంగన్వాడీల సమ్మె 14వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి నిరసన తెలిపారు. లబ్ధిదారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాలు సహకరించాలని అంగన్వాడీలు విజ్ఞప్తి చేశారు. నిడమర్రు : ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల 14వ రోజు సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. శిబిరంలో అంగన్వాడీలు కేక్‌ కట్‌చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు కెవి.సత్యవతి, సుభాషిణి, అంబాల వరలక్ష్మి, జయమ్మ, సబీన పాల్గొన్నారు.ఉంగుటూరు : అంగన్వాడీల సమ్మె 14వ రోజూ కొనసాగింది. ఈ సమ్మెను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. నాయకులు సీర అప్పారావు, నాయకులు పాల్గొన్నారు.జీలుగుమిల్లి : అంగన్వాడీలు 14వ రోజు క్రిస్మస్‌ను పురస్కరించుకుని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ప్రార్థనలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్‌ను ఇళ్ల వద్ద పిల్లపాపలతో మందిరాలకు వెళ్లి ప్రార్థనలు చేసుకోకుండా నిరసన కేంద్రాల వద్దనే చేసుకోవడం ఆవేదన కలిగించిందన్నారు. సిఎం జగన్‌ స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ సమ్మెకు సిఐటియు నేతలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొండలరావు, అంగన్వాడీలు నాగమణి, ఎస్తేరు, సరళ, పూర్ణ పాల్గొన్నారు. కొయ్యలగూడెం : అంగన్‌వాడీలు స్థానిక సమ్మె శిబిరం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. సహకార సంఘ ఉద్యోగుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కెవివి.సత్యనారాయణ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు అబ్బిన సత్యవతి, సిఐటియు నాయకులు ఎస్‌.రాంబాబు, ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు శివ రత్నకుమారి, అడపా నాగజ్యోతి, జయ నాగవేణి, షేక్‌ నూర్జహాన్‌, పద్మజ, శిరీష పాల్గొన్నారు.కలిదిండి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 14వ రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఒంటికాలిపై దండం పెడుతూ కొంగ జపం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు షేక్‌ అబిదాబేగం, జక్కంశెట్టి మేనకలక్ష్మి, కొప్పినీడి రమాదేవి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ముదినేపల్లి : అంగన్వాడీల నిరవధిక సమ్మె 14వ రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ సిఎం జగన్‌ స్పందించి తమ సమస్యలు పరిష్కారించాలన్నారు. లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టి.నరసాపురం : సిఎం జగన్‌ స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనల ద్వారా నిరసన తెలిపారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె శిబిరంలో క్రిస్మస్‌ను పురస్కరించుకుని కేకు కట్‌ చేశారు. జంగారెడ్డిగూడెం : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో సిఎం జగన్‌ మనసు మారాలని కోరుతూ అంగన్వాడీలు ప్రార్థనలు చేశారు. అంగన్వాడీలు 14వ రోజు సమ్మె శిబిరం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పసల సూర్యారావు అధ్యక్షతన ప్రార్థనలు చేశారు. అలాగే మందార పూలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్‌ సుభాషిని, అంగన్వాడీల యూనియన్‌ మండల అధ్యక్షులు లక్ష్మీదేవి, కార్యదర్శి సత్యవేణి, జగదీశ్వరి, షకీలా భాను, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

➡️