పటిష్ట చర్యలతో క్షయ, కుష్టు నివారణ

Feb 4,2024 21:22

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : జిల్లాలో క్షయ, కుష్టు వ్యాధులను నివారిం చేందుకు ప్రభుత్వ పరంగా పలు చర్యలు తీసుకుం టున్నట్లు జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి, క్షయ నివారణ అధికారి కె.రాణి తెలిపారు. ప్రణాళిక బద్ధంగా క్రమం తప్పకుండా మందులు వేసుకొని, సరైన పోషకాహారం తీసుకుంటే ఈ వ్యాధులను నివారించ వచ్చునని చెప్పారు. రోగులను గుర్తించేందుకు ఎల్‌సిడిసి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వీయ రక్షణ చర్యలతో వ్యాధి నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రజాశక్తికి ఈవారం ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా క్షయ (టిబి) రోగులు ఎంతమంది ఉన్నారు?

జిల్లా వ్యాప్తంగా 2023 చివరి నాటికి 1537 మంది క్షయ రోగులను గుర్తించాం. విపరీతంగా దగ్గు, కఫం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, లో ఫీవర్‌ ఉండడం వంటి లక్షణాలతో వీరంతా ఉండడంతో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేశాం. ఈ లక్షణాలు ఎవరిలో అయితే కనిపిస్తాయో వారు దగ్గరలో గల ఆసుపత్రికి వెళ్లి కఫాన్ని పరీక్ష చేయించుకుంటే వ్యాధిని గుర్తించవచ్చు.

రోగులను గుర్తించిన తరువాత వారికి వైద్య సేవలు ఏ విధంగా అందిస్తున్నారు?

క్షయ రోగులకు ఎల్‌సిడిసి విధానం ద్వారా గుర్తిస్తున్నాం. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను తమ సిబ్బంది ద్వారా రోగులకు అందిస్తున్నాం. మందులనేవి ఆరు నెలల నుంచి 9 లేదా 12 నెలల వరకు ఇవ్వవచ్చు. వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తరువాత మరొకసారి టెస్ట్‌ చేయించి మందులను నిలిపివేస్తాం.

టిబి రోగులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయసహకారాలు అందిస్తున్నారు?

క్షయ రోగులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది. రోగులకు ఫుడ్‌ బాస్కెట్‌, నిక్షయ పోషణ యోచనలో భాగంగా నెలకు రూ.500 చొప్పున 6నెలలకు రూ.3వేలు అందిస్తున్నాం.

రోగులు ఎంత కాలం పాటు మందులు వాడాలి?

రోగి మందులు వాడుతూ ఉండగా రోగ నిర్దారణ శక్తిని బట్టి కొందరిలో 6,9,12నెలల సమయం పడుతుంది. ఈ జబ్బు రెండు రూపాల్లో ఉంటుంది. పల్మనరీ, ఎక్స్‌ ట్రా పల్మనరీ రూపాల్లో ఉంటుంది. పల్మనరీ అంటు గొంతుకు సంబంధించినది. ఎక్స్‌ట్రా పల్మనరీ అంటే ఎముకలకు, మెదడకు వ్యాప్తి చెందుతుంది. పలు రకాల పరీక్షలను బట్టి వ్యాధి నిర్ధారణ చేస్తారు. రోగితో పాటు ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తుమ్ము, దగ్గు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. రోగులకు దూరంగా ఉండాలి. 6ఏళ్ల లోపల, తర్వాత వయసు బట్టి మందులు అందిస్తాం.

రోగులు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ?

పాలు, గుడ్డు, పప్పు దినుసులు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. షుగర్‌ వ్యాధి ఉన్న వారు మాత్రం కార్బొహైడ్రేట్స్‌ ఉన్న వాటిని వాడడం వలన షుగర్‌ తగు మోతాదులో ఉంటుంది. అందువల్ల జాగ్రత్త లు తీసుకోవాలి.

క్షయపై అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా?

గ్రామ, పంచాయతీ, మండల,పట్టణ, జిల్లా స్థాయిలో మా సిబ్బంది, స్థానిక హెల్త్‌ సెంటర్లు, సోషల్‌ వర్కర్స్‌ సహాయ సహకారాలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వ్యాధి నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నాం.

కుష్టువ్యాధి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ?

కుష్టు వ్యాధి అంతం పేరుతో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కుష్టు వ్యాధితో పోరాడుదాం – కుష్టువ్యాధినిగత చరిత్ర గా మారుద్దాం అంటూ ప్రచారం చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా మొన్నటి వరకు 230మంది రోగులు ఉండగా, ఐసిడిసి ఈ మధ్య నిర్వహించిన కార్యక్రమం ద్వారా మరో 63మందిని గుర్తించాం.

కుష్టు వ్యాధిని ఎలా గుర్తించాలి?

వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు? వ్యక్తుల శరీరం పై రాగి రంగు మచ్చలు, తిమురులు అధికంగా రావడం ద్వారా గుర్తించవచ్చు. దగ్గు, తుమ్ము తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. 2027నాటికి లెప్రసీ రహిత దేశంగా చేయాలనేదే ప్రధాన ఉద్దేశం. కుష్టు వ్యాధి ఎక్కువైతే అంగవైకల్యం సంభవించే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా లక్షణాలు ఉన్న వ్యక్తులు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. రోగులకు మందులు ఫ్రీగా ఇస్తాం.

➡️